ఏపీలో పెట్టుబడులు రాలేదని విమర్శిస్తున్న వారికి ప్రభుత్వం “నిజాల” పంచ్ ఇస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఏపీలో రూ.96,400 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాయని ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారిక ప్రత్రిక ప్రకటించింది. ఇవేమీ గాలి లెక్కలు కాదు.. ఏ సంస్థ.. ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టిందో కూడా రాశారు. ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. ఇవన్నీ ప్రభుత్వ సంస్థల పెట్టుబడులే.. ప్రైవేటు పెట్టుబడులు వేరు. అవి కలుపుకుంటే లక్ష కోట్ల కు పైగా పెట్టుబడులుఏపీకి వచ్చినట్లనన్నమాట.
మొత్తం రూ.96,400 కోట్ల పెట్టుబడుల్లో ఒక్క ఓఎన్జీసీనే తూర్పు గోదావరి జిల్లాలో రూ.78,000 కోట్లు పెట్టిందట. గతేడాది సెప్టెంబర్లో కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శిని కలిసి జగన్తో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించిన తర్వాత ఈ పెట్టుబడి ఫైనల్ అయింది. ఇక అనంతపురం, కృష్ణా జిల్లాల్లో బీఈఎల్ యూనిట్ల పనులు జరుగుతుండగా విశాఖలో హెచ్పీసీఎల్ రూ.17,000 కోట్ల పెట్టుబడులను పెడుతోంది. అన్ని కలిపితే ప్రభుత్వ రంగ సంస్థలే దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టి ఉద్యోగాల వరద పారిస్తున్నాయి.
ఇక ప్రైవేటు రంగం గురించ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదానీ గ్రూపు కూడా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులను కొనుగోలు చేసిన అదానీ గ్రూపు విశాఖలో రూ.14,634 కోట్లతో డేటా సెంటర్ పెట్టబోతోందన్నారు. ఇక ఐటీసీ, అదానీ, సన్ ఫార్మా, ఆదిత్య బిర్లాలు వరుసకట్టాలని ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా చూస్తే పెట్టుబడుల విప్లవం ఏపీలో కనిపిస్తోందని ప్రభుత్వం నిర్ధారించింది.
అయితే పెట్టుబడులు గ్రౌండింగ్ అవడానికి… పెట్టుబడుల ప్రతిపాదనలకు చాలా తేడా ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిపాదనలన్నీ ఏళ్ల తరబడి ఉన్నాయి. అవి జగన్ సీఎం అయిన తర్వాత రాలేదు. మరో ఇరవై ఏళ్లకయినా ఆ పెట్టుబడులు పెడతారో లేదో చెప్పలేము. ఇక జగన్ సీఎం అయిన తర్వాత ఇంటలిజెంట్ అనే కంపెనీ దగ్గర్నుంచి చాలా కంపెనీలకు భూములిచ్చారు. ఒక్కటీ అడ్రస్ లేదు. మరి ఏ కంపెనీలు ఉద్యోగాలిచ్చియో తేలాల్సి ఉంది.