ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొన్ని పనులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు అమలు చేయాలనుకుంటున్నారు. అందలో మొదటిది ప్రైవేటు స్కూల్ ఫీజులను నియంత్రించడం.. రెండోది ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడం.. మూడోది ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేయడం. ఈ మూడింటి విషయంలో కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజులను నియంత్రించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అలాగే వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై.. కొత్త చట్టాన్ని తీసుకురావాలని కూడా నిర్ణయించారు.
ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకొస్తారు. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్ల తో …” మన ఊరు – మన బడి” ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే సీఎం జగన్ అక్కడ స్కూళ్ల నియంత్రణ పేరుతో.. మరీ దారుణంగా రూ. పదివేలకు అటూఇటుగా ఫీజు నిర్ణయించడంతో కక్ష సాధింపు కోసమే ఈ చట్టం తీసుకొచ్చారన్న ఆరోపణలు వచ్చాయి.
అంత తక్కువ మొత్తంతో సౌకర్యాలు కల్పించి చదువు చెప్పడం కష్టమని.. కోర్టుకెక్కారు. ఇప్పుడు ఈ పంచాయతీ కోర్టులో ఉంది. తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు కోసం కాకుండా.. రీజనబుల్‌గా ఆలోచిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. ఇక నాడు-నేడు పేరుతో ఏపీలో వేల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే.. క్వాలిటీ టీచర్స్ ఉండాలి. చాలా స్కూళ్లలో ఖాళీగా టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ లోపాలపై కేసీఆర్ దృష్టి పెడితే ఏపీ కన్నా పక్కాగా విద్యా వ్యవస్థను సంస్కరించగలుగుతారన్న అభిప్రాయం ఉంది.