చిత్రసీమలో మరో వివాహ బంధానికి బీటలు వారింది. ధనుష్ – ఐశ్వర్యలు విడిపోయారు. పద్దెనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ఇద్దరూ స్వస్తి పలికారు. ఈ మేరకు ధనుష్, ఐశ్వర్యలు ఓ లేఖని విడివిడిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పద్దెనిమిదేళ్లుగా స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా ప్రయాణం చేశామని, ఇప్పుడు పరస్పర ఇష్టంతో విడిపోతున్నామని, తమ నిర్ణయాన్ని గౌరవించమని ఆ లేఖలో పేర్కొన్నారు.
ధనుష్, ఐశ్వర్య విడిపోవడంనిజంగా షాక్ కలిగించే విషయమే. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి వాళ్లు చాలా ఆలోచించే ఉంటారు. కాకపోతే… ధనుష్ ప్రకటించేంత వరకూ ఈ విడాకుల విషయం బయటకు రాలేదు. సినీ తారలు పెళ్లి చేసుకోవడం, అందులో కొంతమంది విడిపోవడం సాధారణమైన విషయమే. కాకపోతే.. విడిపోయే ముందు సోషల్ మీడియాలో గాసిప్పుల పరంపర కొనసాగుతుంది. మెల్లగా ఈ విషయాన్ని స్టార్లు ప్రకటిస్తారు. సమంత – నాగచైతన్య విషయంలో ఇదే జరిగింది. దాదాపు మూడు నెలల పాటు సోషల్ మీడియాలో విడాకుల పై పెద్ద చర్చే జరిగింది. ఆ తరవాత.. ఇద్దరూ తమ నిర్ణయాన్ని ఒకేసారి ప్రకటించారు. ఇప్పటికీ సమంత – చైల విడాకుల వ్యవహారంలో ఏదో ఓ కొత్త గాసిప్పు బయటకు వస్తూనే ఉంటుంది. కానీ ధనుష్, ఐశ్వర్య విషయంలో సోషల్ మీడియాలో ఎలాంటి గాసిప్పులూ రాలేదు. అంత కూల్‌గా… వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నారు. విడాకుల కారణమైతే… ప్రస్తుతానికి బయటకు రాలేదు. ఆ తరవాత కూడా వచ్చే అవకాశమే లేదు.
టాలీవుడ్ లో మరో జంట కూడా విడాకులు తీసేసుకుందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వాళ్లెవరో కాదు.. చిరు కుమార్తె శ్రీజా , కల్యాణ్ దేవ్. వీరిద్దరూ విడిపోతున్నారని కొంత కాలంగా గాసిప్పులు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ.. శ్రీజ తన ఇన్స్ట్రాలో ఇంటి పేరు మార్చేసింది. కల్యాణ్ దేవ్ తో పెళ్లయ్యాక తన ఇన్స్ట్రా ఐడీని శ్రీజా కల్యాణ్ గా మార్చింది. ఇప్పుడు శ్రీజ కొణిదెలగా కనిపిస్తోంది. దాన్ని బట్టి వాళ్లు విడిపోయాన్న హింట్ వచ్చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సమంత కూడా సోషల్ మీడియాలో `అక్కినేని` తొలగించి – విడాకుల విషయాన్ని పరోక్షంగా బయటపెట్టిన సంగతి తెలిసిందే.