ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు ఎవర్నీ వదిలి పెట్టకుండా అందరికీ వాతలు ..కోతలు పెడుతూ జీవో జారీ చేసింది. పీఆర్సీతో జీతాలు తగ్గకుండా అయినా ఉంటాయని ఆశ పడుతున్న వారి ఆశల్ని అడియాసలు చేసింది. అందరి జీతాలు తగ్గబోతున్నాయి. అమరావతిలో పని చేసేవారికి ఎక్కువ.. మిగతావారికి కాస్త తక్కువగా ఈ కోతలు ఉండబోతున్నాయి. చివరికి పెన్షనర్లకూ షాక్ ఇచ్చారు. ఇక పదేళ్లకోసారి పీఆర్సీ అని చెప్పి.. ముందు ముందు ఎలాంటి జీతాలు పెరగబోవని కూడా తేల్చేశారు.
జీతాలు వెనక్కి తీసుకుంటున్నారు.. ఇది నిజం !
2014లో చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఉద్యోగులకు43 శాతం పీఆర్సీ ఇచ్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు మూడునెలల ముందు 20 శాతం మధ్యంతర భృతి ప్రకటించారు. అప్పటికే పీఆర్సీ కోసం అశుతోష్ మిశ్రా కమిటీని నియమించారు. జగన్ గెలవడంతో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. ఉద్యోగులకు 20 శాతం ఏమిటీ చీప్‌గా అని 27 శాతం చేశారు. పీఆర్సీ నివేదిక పరిశీలించి మరింత పెంచుతామన్నారు. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు 23 శాతమే ఫిట్మెంట్ ఖరారు చేశారు. అంటే జగన్ ఇచ్చిన దాన్ని కూడా నాలుగు శాతం తగ్గించారు. మరి రెండున్నరేళ్ల పాటు మధ్యంతర భృతి 27 శాతం వచ్చింది.. ఇప్పుడు ఫిట్మెంట్ 23 శాతమే ఇచ్చారు..మరి అదనంగా ఇచ్చిన నాలుగు శాతం ఏం చేస్తారు ? ఇచ్చేశారు కాబట్టి తీసుకోరేమో అని చాలా మంది అనుకున్నారు. అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని ప్రభుత్వం తేల్చేసిది. ఆ నాలుగు శాతం.. రెండున్నరేళ్ల నుంచి ఇచ్చింది వెనక్కితీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు అర్థరాత్రి జీవోలో ఉంది.
పెండింగ్ డీఎలు అన్నీ ఇస్తున్నామని .. కోతలతో సరిపెట్టే ప్లాన్ !
ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి డీఏలు సరిగ్గా ఇవ్వడం లేదు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు అన్ని డీఏలు ఇస్తామని చెప్పారు. ఆ డీఏలను పెండింగ్‌లో ఉన్న 201 9 నుంచి ఇస్తామని చెప్పారు. కానీ ఇలా ఎందుకు చెప్పారంటే… ఫిట్మెంట్లో తేడా ఉన్న నాలుగు శాతం ఇచ్చామని కవర్ చేసుకోవడానికి. అక్కడ తగ్గించి.., వాటిని డీఏల రూపంలో సర్దుబాటు చేశామని చెప్పుకోవడానికి. ఇవ్వాల్సిన డీఏ ఇవ్వకుండా ఇలా జీతం వెనక్కి తీసుకునేదానికి భర్తీ చేసేలా ఉపయోగించుకోవడంతో ఉద్యోగుల కడుపు మండిపోతోంది.
ఇక హెచ్ఆర్ఏతో జీతాలకు కోతలే !
ఫిట్మెంట్ తగ్గిస్తే తగ్గించారని కానీ హెచ్ఆర్ఏ తగ్గించవద్దంటూ పీఆర్సీ ప్రకటన సమయంలో చప్పట్లు కొట్టిన ఉద్యోగ సంఘాల నేతలు కాళ్లావేళ్లా పడ్డారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. సీఎస్ కమిటీ సిఫార్సులు చేసిందని హెచ్ఆర్ఏను పూర్తి స్థాయిలో తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల సచివాయ ఉద్యోగులు ఎక్కువ నష్టపోతున్నారు. జీవో ప్రకారం సచివాలయ హెచ్‌వోడీ ఉద్యోగులు 22 శాతం, జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులు దాదాపు 12 శాతం మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు 6.5శాతం, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు 4.5శాతం హెచ్ఆర్ఏ కోల్పోనున్నారు.
పెన్షనర్లనూ వదల్లేదు !
పెన్షనర్లకు ప్రస్తుతం 70 ఏళ్లు దాటిన వారికి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రూపంలో కాస్త ఎక్కువ వచ్చేది. ఇప్పుడు ఆ వయసు 80 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెన్షనర్లు తీవ్రంగా నష్టపోనున్నారు. జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి.. చివరి దశలో ఉన్న వారికి..తమ అవసరాలకు … పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పెన్షన్ రాకుండా పోతుందే అన్న ఆందోళన వారిది..!
ఆర్టీసీ ఉద్యోగులకూ పంచ్!
పీఆర్సీ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం పేరుతో ఉన్న సౌకర్యాలను నిలుపుదల చేశారని.. ఒక పీఆర్సీ కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేశారు. 2017 పీఆర్సీకి 2019లో 25శాతం తాత్కాలిక ఫిట్మెంట్ ఇచ్చారని, ప్రభుత్వోద్యోగులతో పాటే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఫిట్మెంట్ ఇస్తామన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో విలీనం వల్ల 2021 పీఆర్సీ పెండింగ్‌లో ఉందని అంటున్నారు.
సమీప భవిష్యత్‌లో జీతాలు పెరగవు !
ఇక ఏపీ ప్రభుత్వం ఎలాంటి వేతన సవరణ కమిషన్లు నియమించదు. కేంద్ర ఉద్యోగుల కోసం కేంద్రం నియమించే వేతన సవరణ కమిషన్ సిఫార్సుల్నే అమలు చేయాలని నిర్మయిస్తారు. ఇది పదేళ్లకోసారి వస్తుంది. దీంతో సమీప భవిష్యత్‌లో ఇక ఏపీ ఉద్యోగులకు జీతాలు పెరిగే చాన్స్ లేదని అనుకోవచ్చు.