పంజాబ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భగవంత్ సింగ్ మాన్‌ను కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజల నుంచి అభిప్రాయసేకరణ చేసి మరీ ఆయన ఈ ప్రకటన చేశారు. పాతిక లక్షల మంది స్పందించారని.. అందులో తొంభై శాతం మంది మాన్నే సమర్థించారని గొప్పగా చెప్పారు. తాము గొప్ప ప్రయోగం చేశామని కేజ్రీవాల్ చెప్పుకుంటున్నారు.. కానీ నిజానికి ప్రజల్లో ఉన్న సందేహాన్ని ఆయన తీర్చారు.
అదేమిటంటే .. ఒక వేళ ఆప్ పంజాబ్‌లో గెలిస్తే కేజ్రీవాల్ సీఎం అవుతారేమో అన్న సందేహం అక్కడి ప్రజల్లో చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీకి కేజ్రీవాల్ సీఎంగా ఉన్నారు. ఢిల్లీకి సీఎం అనే పేరే కానీ అది కేంద్ర పాలిత ప్రాంతం. ఇటీవల చట్టం ద్వారా ప్రభుత్వం అంటే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అని అర్థం వచ్చేలా కేంద్రం మార్చేసింది. కేజ్రీవాల్‌కు అధికారాలు పరిమితం. దీంతో ఆయన పంజాబ్ సీఎంగా వెళ్లాలనుకుంటున్నారని గతంలో ప్రచారం జరిగింది. గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ వెనుకబడిపోవడానికి ఇది కూడా ఓ కారణం. ఎందుకంటే కేజ్రీవాల్ పంజాబ్‌కు చెందిన వ్యక్తి కాదు.
హర్యానాకు చెందిన నేత. హర్యానా కు చెందిన కేజ్రీవాల్ పంజాబ్‌కు సీఎం అవడాన్ని అక్కడ ఎవరూ జీర్ణించుకోలేరు. ఈ పరిస్థితి ఈ సారి రాకుండా పంజాబ్‌కే చెందిన భగవంత్ మాన్‌ను సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా ముందే ప్రకటించారు. అది కూడా తాను ప్రకటించినట్లుగా కాకుండా.. ప్రజల చాయిసే అన్న కలరింగ్ ఇవ్వగలిగారు. ఇతర పార్టీల రాజకీయ నేతలతో పోటీ పడి వ్యూహాల్ని కేజ్రీవాల్ అమలు చేస్తున్నారని దీని ద్వారా తెలిసిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.