విడాకుల ప్రకటన వచ్చి 24 గంటలు గడిచిందో లేదో.. అప్పుడే తమిళ నాట రజనీ ఫ్యాన్స్, ధనుష్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మొదలైపోయింది. ధనుష్‌ని అనవసరంగా అల్లుడ్ని చేసుకున్నారంటూ.. రజనీ ఫ్యాన్స్, అసలు ఈ వ్యవహారంలో ఐశ్వర్యదే తప్పంటూ.. ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సై అంటే సై అంటూ.. మాటలతో తలపడుతున్నారు. `వి సపోర్ట్ ధనుష్`, `వి సపోర్ట్ ఐశ్వర్య` అంటూ.. హ్యాష్ ట్యాగులు తమిళ నాట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇన్నాళ్లు ఒక్కటిగా ఉన్న రజనీ, ధనుష్ ఫ్యాన్స్ మధ్య 24 గంటల వ్యవధిలోనే… ఓ గోడ వచ్చేసింది. అదీ… విడాకుల సైడ్ ఎఫెక్ట్ అంటే.
నిజానికి… తమిళ నాట ధనుష్ – ఐశ్వర్యల విడాకులు ఎవ్వరూ ఊహించలేదు. స్టార్ జంట విడిపోయేటప్పుడు.. ఫ్యాన్స్ ని ప్రిపేర్ చేయడానికి కొన్ని రూమర్లు, ఫీలర్లు వదులుతుంటారు. ఆ తరవాత.. అసలు విషయాన్ని రివీల్ చేస్తారు. సమంత – నాగ చైతన్య విడాకుల వ్యవహారంలో ఇదే జరిగింది. సమంత `అక్కినేని` అనే పేరు తొలగించి, ఫ్యాన్స్ ని సన్నద్ధం చేసింది. ఆ తరవాత జరిగిన వ్యవహారం అంతా తెలిసిందే. అందుకే సమంత – నాగచైతన్య విడిపోవడం పెద్ద షాకింగ్ విషయం అనిపించలేదు. ఎందుకంటే అప్పటికే ఫ్యాన్స్ ప్రిపేర్ అయిపోయారు. ఇప్పుడు అలా కాదు. ఇది సడన్ గా తీసుకున్న నిర్ణయమే అనిపిస్తోంది. రెండు నెలల క్రితం వరకూ..అంతా బాగానే ఉన్నట్టు కనిపించింది. ఒకరి గురించి ఒకరు ట్వీట్లు చేసుకోవడం, పార్టీలకు వెళ్లడం.. జరిగాయి. కానీ రెండు నెలల వ్యవధిలోనే ఇన్ని పొరపొచ్చాలు వచ్చి, విడిపోయి, విడాకుల వరకూ ఎలా వెళ్లిపోయారన్నదే అసలు ప్రశ్న.
ధనుష్ – ఐశ్వర్యల మధ్య గ్యాప్ యేడాది నుంచే ఉందని, కానీ… ఎవరూ బయటపడలేదని, పెద్దలు రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేశారని, కానీ అవి సఫలం కాలేదని, రజనీకాంత్ కూడా `మీ జీవితం మీ ఇష్టం` అని తేల్చేసిన తరవాతే విడాకుల నిర్ణయం తీసుకున్నారని చెన్నై వర్గాలు చెబుతున్నాయి.