కాంగ్రెస్ పార్టీలో ఒకప్పట్లో చక్రం తిప్పిన నాయకుడు బొత్స సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆ పార్టీలో ముసలం పుట్టినదనే వార్తలు ఇవాళ్టివి కాదు. బొత్స సత్యనారాయణ దూకుడును కాంగ్రెసులో ఉండగానే భరించలేక మౌనంగా ఉంటూ వచ్చిన అనేక మంది సీనియర్ నాయకులు, ఆ తర్వాతి రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్లోకి వచ్చారు. తీరా తమకు శత్రువైన, సుతరామూ గిట్టని బొత్స సత్యనారాయణ కూడా ఇటు వచ్చేసరికి వారు సహించలేకపోయారు. అప్పటినుంచి అసంతృప్తితో ఉన్నారంటూ రాజకీయవర్గాల్లో ప్రచారం ఉంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులకు అనుకూలంగా ద్వారాలు తెరచిన తర్వాత… విజయనగరం జిల్లానుంచి కీలక నాయకులు సుజయకృష్ణ రంగారావు, ఆయన అనుచరులు, బొత్స వైఖరి కిట్టని మరికొందరు నాయకులు తెలుగుదేశంలోకి వచ్చేస్తున్నట్లుగా బాగా ప్రచారం జరిగింది.
దానికి తోడు భూమా నాగిరెడ్డి అండ్ కో సోమవారం నాడు పార్టీలో చేరిన సమయంలో అక్కడకు వచ్చిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇంకా చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని, వైకాపా దాదాపు సగం వరకు ఖాళీ అవుతుందని వ్యాఖ్యానించడంతో తొలి అనుమానాలు విజయనగరం ఎమ్మెల్యేల మీదికే మళ్లాయి. అయితే సుజయకృష్ణ రంగారావు మంగళవారం నాడు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
తాము తెదేపాలో చేరబోతున్నామంటూ జరుగుతున్నదంతా ప్రచారమే తప్ప నిజం కాదని ఆయన సెలవిచ్చారు. విజయనగరం జిల్లానుంచి నాయకులు ఎవ్వరూ కూడా వైకాపాను వీడిపోవడం లేదంటూ ఆయన పేర్కొనడం విశేషం. బొత్స సత్యనారాయణ వైకాపాలో ప్రాధాన్యంతో కొనసాగుతుండగా.. అదంటే గిట్టకనే రంగారావు బ్యాచ్ మొత్తం పార్టీ వీడిపోతున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే బొత్స దెబ్బ పార్టీ మీద దుష్ప్రభావం చూపిస్తున్నదనడం తప్పుడు ప్రచారమేనని తేలినట్లే లెక్క. జరుగుతున్న పరిణామాలను బట్టి గమనిస్తే.. చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని తెలుగుదేశం అంచనాలు వేసుకున్నదేమో అనిపిస్తోంది. వీరు పిలిచారో, లేదా, వస్తాం అని వారే అడిగారో తెలియదు గానీ.. వీరి లెక్కల్లో చాలామందే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ నచ్చజెప్పడం లేదా, తెదేపాలోకి వెళ్లడానికి బేరాలు కుదరకపోవడం నేపథ్యంలో మొత్తానికి కొందరు ఎమ్మెల్యేల చేరిక మాత్రం ఆగిపోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా సుజయకృష్ణ రంగారావు అండ్ టీం తెలుగుదేశంలోకి రావడం లేదని క్లారిటీ ఇవ్వడం తెదేపా లో కొందరు నాయకులకు అయినా షాక్ అవుతుందని అనుకుంటున్నారు.