`అన్ స్టాపబుల్`లో బాలకృష్ణ దుమ్ము రేపుతున్నాడు. ఆహాలో సూపర్ డూపర్ హిట్ అయిన పోగ్రాం ఇది. ఆహా… పై జనాలకు ఆసక్తిని కలిగించేలా చేసిన టాక్ షో ఇది. ఇందులో బాలయ్య విశ్వరూపం చూపిస్తున్నాడు. దాంతో ఆహా వ్యూవర్ షిప్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పటి వరకూ ప్రతీ ఎపిసోడూ హిట్టే. అందుకే ఈ షోలో పాల్గొనాలని ఉందంటూ.. వర్మ ఓ ట్వీట్ చేశాడు. `బాలయ్య అవకాశం ఇస్తానంటే… ఈ షోలో పాల్గొంటా` అంటూ ట్విట్టర్ వేదికగా వర్మ బాలయ్యని కోరుకున్నాడు. బాలయ్య – వర్మ కలిస్తే… కచ్చితంగా అది మరో అరాచకం అవుతుంది. ఎందుకంటే… వర్మ ఓపెన్ గా ఉంటాడు. బాలయ్య ఇంకా ఓపెన్ గా అడిగేస్తున్నాడు. సో… అన్ స్టాపబుల్ కి వర్మ వస్తే… ఎంటర్‌టైన్‌మెంట్ కి గేట్లు ఎత్తేసినట్టే. కాకపోతే… వర్మని పిలవడానికి బాలయ్య ఒప్పుకుంటాడా? అనేదే పెద్ద డౌటు. ఎందుకంటే… `లక్ష్మీస్ ఎన్టీఆర్` నుంచి వర్మ పై బాలయ్య గుర్రుగా ఉన్నాడు. ఆ సినిమా ఎన్టీఆర్ ఇమేజ్‌ని డ్యామేజ్‌కలిగించేలా ఉందన్నది బాలయ్య అభిప్రాయం. మరోవైపు చంద్రబాబు అంటే వర్మకి అస్సలు గిట్టదు. దాంతో బాలయ్య వర్మని పిలిచే ఛాన్స్ లేదు. కాకపోతే… బాలయ్య భోళా శంకరుడు. ఎవరైనా, ఏదైనా అడిగితే కాదనడు. తన కోపం క్షణకాలమే. వర్మ- బాలయ్య టాక్ షో.. ఫుల్ గా వర్కవుట్ అవుతుందని అల్లు అరవింద్ కి ఏమాత్రం అనిపించినా, కచ్చితంగా ఈ షోకి వర్మని లాక్కొచ్చేస్తాడు. అదే జరిగితే… ఈసారి ఆహా కాదు.. ఆహాహా… అనాల్సిందే.