పంజాబ్ లో హఠాత్తుగా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ దగ్గరి బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. దాదాపుగా పది చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాలో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలో ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. . ఎన్నికలకు ముందు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇలా సీఎం బంధువుల ఇళ్లను టార్గెట్ చేయడంపై సహజంగానే రాజకీయ విమర్శలు వస్తున్నాయి.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ ముఖ్య నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఓ నేత ఇంట్లో రూ. 170 కోట్లకుపైగా క్యాష్ దొరికింది. తీరా తేలిందేమిటంటే ఆ వ్యాపారి సమాజ్ వాదీ పార్టీకి చెందిన వారు కాదని.. పేరులో కన్ఫ్యూజ్ వల్ల ఐటీ అధికారులు ఆయన ఇంటిపై దాడి చేశారని వెళ్లడయింది. తర్వాత పేరు సరి చూసుకుని నిజమైన సమాజ్ వాదీ పార్టీ నేత ఇంట్లో సోదాలు చేసినా ఏమీ దొరకలేదు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఎన్నికల సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎలా దాడి చేశారో.. ఇప్పుడు అలాగే చేస్తున్నారని పంజాబ్ సీఎం మండిపడుతున్నారు.
ఎక్కడ ఎన్నికలు జరిగినా కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు.. బీజేపీయేత పార్టీల నేతలపై జరగడం కామన్. అందుకే విపక్ష పార్టీలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ మిత్రపక్షాలుగా అభివర్ణిస్తూ ఉంటాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అదే చెబుతూ ఉంటారు. అందుకే.. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు సీబీఐకి జనరల్ కన్సెంట్‌ను రద్దు చేస్తున్నాయి. దీంతో ఈడీ, ఐటీలను కేంద్రం ఉపయోగించుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.