టీడీపీ నుంచి వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలకు ఉక్కపోత ఎక్కువగానే ఉంది. ఎవరికీ సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. వైసీపీలోని ద్వితీయ శ్రేణి నేతలకు దక్కుతున్న ప్రాధాన్యత కూడా వారికి లేదు. దీంతో వారు మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోది. వీరిలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వ్యవహారం బహిరంగమయింది. ఆయన ఇటీవల చంద్రబాబును కలిశారని..మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు సంసిద్ధత తెలిపారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీలోకి వచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు కానీ మళ్లీ అసెంబ్లీ టిక్కెట్ ఇస్తామనే ఆశలు పెట్టుకుని అయితే రావొద్దని తెగేసి చెప్పారని అంటున్నారు. పార్టీకి నమ్మకద్రోహం చేసి వెళ్లి అక్కడ ప్రాధాన్యత దక్కలేదని తిరిగి వస్తే మళ్లీ టిక్కెట్ ఎలా ఇస్తామని చంద్రబాబు భావిస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోనే కాకుండా.. మొత్తం విశాఖ జిల్లా నేతలు వాసుపల్లిని అసలు పార్టీలోకే తీసుకోవద్దని చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. టిక్కెట్ ఇవ్వకుడా మళ్లీ తిరిగి వెళ్తే అటూ ఇటూ కాకుండా అయిపోతానని వాసుపల్లి ఆలోచిస్తున్నారు.
అయితే ఇప్పటికే ఆయనను వైసీపీ హైకమాండ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. పట్టించుకోవడం మానేశారు. పార్టీ కార్యక్రమాలకు కూడా పిలుపులేదు. గతంలో అయితే ఏదో ఓ ప్రచార కార్యక్రమం చేపట్టి మీడియాలో పబ్లిసిటీ చేసుకునే వాసుపల్లికి ఇటీవల అలాంటి అవకాశం కూడా దక్కడం లేదు. ఏం అశించి పార్టీ మారారో కానీ.. రాజకీయ భవిష్యత్ అంధకారం అయిపోయిందని ఆయన అనుచరులు.. ఒక్కొక్కరుగా పక్క చూపులు చూసుకుంటున్నారు.