తెలంగాణ సర్కార్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడతామని చెప్పింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశ పెడితే కొంతమంది విమర్శిస్తున్నారని.. ఇప్పుడేం అంటారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశపెడతామని చెప్పారు కానీ.. ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉంచుతామని చెప్పలేదు. తెలుగు మీడియం కూడా ఉంటుంది. ఏపీలో ఏకంగా తెలుగు మీడియాన్నిరద్దు చేసి ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇక్కడ రాజకీయపరమైన అంశాలు కూడా ఉన్నాయి.
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో దశళవారీగా ఇంగ్లిష్ మీడియంను ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు తెలుగును చంపేస్తున్నారని వైసీపీ రచ్చ చేసింది. సొంత పత్రికల్లో.. టీవీల్లో చర్చలు పెట్టింది. ప్రస్తుతం భాషను బతికించే పదవులు తీసుకుని నెలకు రూ. నాలుగైదు లక్షలు తీసుకుంటున్న సలహాదారులు అప్పట్లో అర్థనగ్నంగా నిరసనలు చేశారు. కానీ అప్పుడు చంద్రబాబు ఇంగ్లిష్ మీడియంను మాత్రమే ఉంచుతానని అనలేదు. తెలుగు మీడియం కూడా ఉంటుందన్నారు.
అప్పట్లో వ్యతిరేకించి.. ఇప్పుడు తెలుగు మీడియాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేయడంపైనే విమర్శలు వస్తున్నాయి. మాతృభాషను కాపాడుకోకపోతే కష్టమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికి ఏపీ ప్రభుత్వం ఎదురుదాడికి ప్రయత్నిస్తూనే ఉంది. తెలంగాణలో పెడుతున్నారు ఏం చేస్తారనిప్రశ్నిస్తోంది. కానీ తెలుగు మీడియం రద్దు చేయడానికి.. ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశ పెట్టడానికి హస్తిమశకాంతరం ఉంది. అది అర్థం చేసుకునేంత వికాసం అధికార పార్టీ నేతల్లో ఉందని ఎవరూ అనుకోవడం లేదు.