కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. యాభై వేల పరిహారం ఇస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ మేరకు జాతీయ విపత్తు నిధుల నుంచి డ్రా చేసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. కరోనా కారణంగా చిన్నాభిన్నమైన కుటుంబాలకు ఆ యాభై వేలు ఓ ఆధారంగా ఉంటాయని అనుకున్నారు. దేశంలో మెజార్టీ రాష్ట్రాలు తమ బాధ్యతగా భావించి పరిహారం పంపిణీ చేశాయి. అయితే ఏపీ, బీహార్ మాత్రం.. వాళ్లకేంటి ఇచ్చేదని లైట్ తీసుకున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను తమ ఎదుట వర్చువల్గా హాజరు కావాలని ఆదేశించింది. ఆ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ కూడా హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల ఐదు వేల మందికి పెండింగ్లో ఉన్నాయని.. వారంలో రోజుల్లో ఇచ్చేస్తామని సీఎస్ సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. రెండు వారాల గడువు ఇస్తే అందరికీ పంపిణీ చేసి ఆ వివరాలను కోర్టుకు సమర్పిస్తామన్నారు. దీంతో సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.
అయితే మానవత్వం గురించి పదే పదే చెప్పే ప్రభుత్వం కేంద్రం విపత్తు నిధులను సాయం కోసం ఇవ్వాలని మంజూరు చేసినా ఎందుకు ఇవ్వడం లేదన్నది ఎవరికీ అర్థం కాని విషయం. కరోనా కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు అంత్యక్రియలకు గతంలో రూ. పదిహేను వేలు ఇస్తామన్నారు. జీవో ఇచ్చారు. కానీ ఎవరికీ ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వలేదు. అందుకే ఏపీ ప్రభుత్వం చెప్పే మాటలకు.. చేసే చేతలకు ఎక్కడా పొంతన ఉండటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.