పెద్ద సినిమా అంటే ఐటెమ్ గీతం మస్ట్ అయిపోయింది. `పుష్ప` లో సమంత ఐటెమ్ గీతం ఎంత మైలేజ్ ఇచ్చిందో తెలిసిందే. సినిమాలకు అది అదనపు ఆకర్షణ అయిపోతోంది. `లైగర్` కోసం కూడా అదిరిపోయే ఐటెమ్ గీతం రెడీ అయిపోయిందట. పూరి – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. పూరి సినిమా అంటే.. ఐటెమ్ గీతం తప్పనిసరి. ఆయన ఐటెమ్ పాటని సరికొత్త పంథాలో డిజైన్ చేయగలడు. `పోకిరి`లో `ఇప్పటికింకా నా వయసే` ఎంత ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. అప్పటి నుంచీ పూరి సినిమాలో ఐటెమ్ గీతాలకు మరింత క్రేజ్ వచ్చింది. `లైగర్`లోనూ ఆ సెంటిమెంట్ కొనసాగించాలని చూస్తున్నారు.
అయితే ఈ పాటలో నర్తించడానికి ఓ స్టార్ హీరోయిన్ కావాలి. తన కోసమే పూరి టీమ్ గట్టిగా అన్వేషిస్తోంది. పూరితో చాలామంది స్టార్ హీరోయిన్లు పనిచేశారు. వాళ్లెవరిని అడిగినా కాదనరు. అయితే… ఇప్పటి వరకూ ఐటెమ్ పాటలో కనిపించని కథానాయికతోనే ఈ పాట చేయించాలని పూరి భావిస్తున్నాడట. ఓ రకంగా ఇది కూడా `పుష్ప` స్ట్రాటజీనే అనుకోవాలి. అసలు ఐటెమ్ గీతమంటేనే ఎరుగని సమంతతో ఆ పాట చేయించి, ఇంకాస్త మైలేజీ తెచ్చుకున్నాడు సుకుమార్. పూరి కూడా ఇలానే భావిస్తున్నాడు. ఇప్పటి వరకూ ఐటెమ్ సాంగ్ చేయని కథానాయికతో ఈ పాట తెరకెక్కించాలని చూస్తున్నాడు. మరి ఆ లిస్టులో ఎవరున్నారబ్బా..?