మూడ్ ఆఫ్ ది నేషన పేరుతో ఇండియా టుడే విడుదల చేసిన పోల్‌లో ఏపీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. సీఎం జగన్ ఓ జాబితాలో అసలు చోటు దక్కించుకోలేకపోయారు. మరో జాబితాలో మాత్రం 3.3 శాతం ఆదరణ పొందారు. అయితే ఇతర రాష్ట్రాల వాళ్లు జగన్ పేరు చెబితే ఈర్యాంక్ వచ్చింది. కానీ సొంత రాష్ట్ర ప్రజలు చాయిస్ ఇచ్చిన చోట మాత్రం ఆయన పాపులారిటీ దారుణంగా పడిపోయింది.
ఇతర రాష్ట్రాల ఓటర్ల అభిప్రాయంలో జగన్ బెస్ట్ సీఎంలలో ఒకరరు !
ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ సర్వేలో ముఖ్యమంత్రుల విషయంలో రెండు రకాల పోల్స్ నిర్వహిస్తుంది. దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల ప్రజలకు ఫోన్లు చేసి.. దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు అని అడుగుతుంది. దీన్ని మోస్ట్ పాపులర్ సీఎం కేటగిరిలో చేర్చారు. ఈ కేటగిరిలో మొదటి స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఆయనకు 27.1 శాతం ఓటు వేశారు. తర్వాతి స్థానంలో ఢిల్లీ సీఎం అరవింజ్ కేజ్రీవాల్ ఉన్నారు. 19.9 శాతం మంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు రెండో బెస్ట్ సీఎం అన్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్దవ్ ధాకరే వంటి వారికి తర్వాత స్థానాలు లభించాయి. తర్వాత సీఎం జగన్‌కు 3.3 శాతం ఓట్లతో ఐదో స్థానం లభించింది. విశేషం ఏమిటంటే.. నవీన్ పట్నాయక్ కూడా జగన్ తర్వాతే ఉన్నారు. ఈ పోల్స్‌లో పాల్గొన్న వారు ఆయా రాష్ట్రాల్లో ఓట్లు వేయరు.
సొంత రాష్ట్ర ఓటర్లు పాల్గొన్న పోల్‌లో కనీస రేటింగ్ దక్కించుకోని సీఎం జగన్ !
ఇక సొంత రాష్ట్రంలోని ఓటర్లతో నిర్వహించిన పోల్‌ను మోస్ట్ పాపులస్ సీఎం కేటగిరీగా ఇండియా టుడే నిర్ణయించింది. ఈ కేటగిరిలో ఆయా రాష్ట్రాల ఓటర్లకు ఫోన్లు చేసి.. మీ సీఎం పని తీరు ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. ఇందులో సీఎం జగన్‌కు చోటు దక్కలేదు. అసలు తాము నిర్ణయించుకున్న బెంచ్ మార్క్ వరకూ ఆయనకు ఆదరణ లేదని ఇండియాడు టుడే చెబుతోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పనితీరును బెంగాల్ ప్రజలు 69.9 శాతం స్వాగతించారు. ఆ తర్వాత స్టాలిన్, ఉద్దవ్ ధాకరే, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, హిమంత భిశ్వ శర్మ, భూపేష్ బాఘెల్, అశోక్ గెహ్లాట్ ఉన్నారు. వీరంతా తమ తమ రాష్ట్రాల ప్రజల్లో కనీసం 44.9 శాతం ప్రజల ఆమోదం పొందారు. మిగతా సీఎంలు ఎవరూ ఆ వరకూ రాలేదు. ఈ జాబితాలో సీఎం జగన్ లేరు. ఆయన ఓట్లు వేసే ఏపీ ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోయారు. విచిత్రం ఏమిటంటే దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం అయిన యోగి.. సొంత రాష్ట్రంలో మాత్రం కనీస ఆదరణ దక్కించుకోలేకపోయారు.
జాతీయ స్థాయిలోనూ పాపులర్ కాలేని కేసీఆర్ !
తెలంగాణ సీఎం కేసీఆర్ అటు తెలంగాణ కాకుండా మొత్తం ఓవరాల్‌గా నిర్వహించిన పోల్ విషయంలోనూ ప్రజల మైండ్‌లో ఫిక్స్ కాలేకపోయారు. జాతీయ రాజకీయాల ప్రయత్నాల్లో ఉన్న ఆయన… ఇలా కనీసం సీఎంగా జాతీయస్థాయిలో గుర్తింపు కూడా తెచ్చుకోలేదు. అలాగే రాష్ట్ర స్థాయిలోనూ వెనుకబడ్డారు. మోప్ట్ పాపులర్ కేటగిరీలో కానీ.. మోస్ట్ పాపులస్ కేటగరిలో కానీ ఆయన చోటు దక్కించుకోలేకపోయారు.
శాంపిల్స్ చాలా చాలా పరిమితం !
ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ సర్వే శాంపిల్స్ చాలా అంటే చాలా పరిమితం. 70శాతం మంది మమతా బెనర్జీకి జై కొడుతున్నారన్న బెంగాల్‌లో తీసుకున్న శాంపిల్ కేవలం 4900 మాత్రమే. కొన్ని రాష్ట్రాల్లో రెండు వేలు కూడా తీసుకోలేదు. ఇక దేశవ్యాప్తంగా బెస్ట్ సీఎంలను నిర్ణయించడానికి తీసుకున్న శాంపిల్ 30 రాష్ట్రాల నుంచి కేవలం అరవై వేల మంది. ఇందులో ఏపీ,తెలంగాణ నుంచి వెయ్యి మంది ఉంటారో లేదో కూడా అంచనా వేయడం కష్టమే.