ఈరోజుల్లో సినిమా అంటే భారీదనం చూపించాల్సిందే. అందులోనూ పెద్ద హీరోల సినిమాలకు. సెట్ల విషయంలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గడం లేదు. పదుల కొద్దీ సెట్లు వేస్తున్నారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే.. రవితేజ కొత్త సినిమాకి ఒక్క సెట్టు కూడా వేయడం లేదట. రవితేజ – సుధీర్ వర్మ కాంబినేషన్లో `రావణాసుర` అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఒక్క సెట్ కూడా వేయకూడదని నిర్ఱయించుకున్నార్ట. స్క్రిప్టులో ఆ అవసరం కూడా రాలేదని, సన్నివేశాలన్నీ సహజమైన లొకేషన్లలో తీయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. దాని వల్ల బడ్జెట్ తగ్గడమే కాదు, సన్నివేశాలు మరింత సహజంగా ఉంటాయని భావిస్తున్నారు. సుధీర్ వర్మ `స్వామి రారా`, `దోచేయ్` సినిమాల్లో కూడా సెట్లు పెద్దగా కనిపించవు. అన్నీ సహజమైన లొకేషన్లలో తీసిన సినిమాలే. అదే ఫార్ములా… రవితేజ సినిమాకీ అప్లయ్ చేస్తున్నాడన్నమాట.