ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు మరోసారి న్యాయవ్యవస్థను టార్గెట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అసలు సమయం.. సందర్భం లేకపోయినా మంత్రి పేర్ని తప్పు చేస్తే జడ్జిలనుకూడా వదలబోమంటూ ప్రకటన చేసేశారు. అంతే కాదు తప్పు చేస్తే రాజకీయ పార్టీలు పెట్టిన సినీ నటులనూ వదలబోమన్నారు. తప్పులు ఎవరు చేస్తున్నారు..? ఎవరు వదిలేస్తున్నారు.? చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థలకు ఒకరు ఆదేశాలివ్వాలా ? అనే విషయాలను పక్కన పెడితే.. అసలు న్యాయవ్యవస్థ గురించి పేర్ని నాని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. పేర్ని నానికి తెలుసో లేదో కానీ.. న్యాయవ్యవస్థ ఎప్పుడూ ప్రభుత్వానికి లోబడి ఉండదు.
ప్రభుత్వం ఎలాంటి చర్యలూ జడ్జిలపై నేరుగా తీసుకోలేదు. న్యాయవ్యవస్థలో జరిగే తప్పులు చూసుకోవడానికి ఆ వ్యవస్థలో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. కానీ ఇక్కడ పేర్ని తప్పు చేస్తే జడ్జిలను కూడా వదలబోమని హెచ్చరించడం .. ఖచ్చితంగా ఓ ప్రణాళిక ప్రకారం చేసిన బెదిరింపుగా భావిస్తున్నారు. గతంలో న్యాయవ్యవస్థపై ఢీ అంటే ఢీ అన్నారు. త్వరలో మరోసారిఅలాంటి పరిస్థితి కల్పిచుకునేందుకు సిద్ధమవుతున్నారా అన్న ఊహాగానాలు ఈ ప్రకటన ద్వారా వస్తున్నాయి.
ఏపీలో అడ్డదిడ్డంగా సాగుతున్న నేరాలకు .. పట్టపగలు జరుగుతున్న హత్యలు చేస్తున్న వారికి … కేసినోలు తెచ్చి నడుపుతున్న వారికి .. ఎవరికీ పిసరంత భయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు జడ్జిలను కూడా వదిలి పెట్టబోమని హెచ్చరికలు చేస్తున్నారు. సమయం.. సందర్భం లేకుండా జడ్డిల గురించి మాట్లాడాలంటే.. ఖచ్చితంగా ఏదో.. ఓ లోతైన ప్లాన్ ఉంటుందని భావిస్తున్నారు. అదేమిటో కొద్ది రోజుల్లో తేలనుంది. అప్పుడే జడ్జిలు తప్పు చేస్తే వదలబోమని చెప్పే అధికారం ఉందో లేదో…మంత్రి వర్యులకు తెలుస్తుంది.