ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేయించలేదు. ఈ విషయం ఆధారాలతో సహా కేసీఆర్కు అందించారు ఖమ్మం నేతలు. దీంతో చర్యలు తీసుకోవడం ఖాయమని.. కేసీఆర్ గతంలోనే హెచ్చరించారు. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీన్ అర్థమైపోయింది. తనకు ఇక ఎమ్మెల్సీ, రాజ్యసభే కాదు.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ టిక్కెట్లు దక్కవని అర్థమైపోయింది.
అయితే ఆయన ఇప్పటికిప్పుడు బయటకు వెళ్లాలని అనుకోవడం లేదు. బయటకు వెళ్తున్నా అనే ఫీలర్స్ పంపి అయినా సరే ఏదో ఓ హామీ పొందాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీలోకి వెళ్తున్నానని.. తన కోసం ఏపీ సీఎం జగన్ బీజేపీ నాయకత్వంతో మాట్లాడారని ఆయన తెలంగాణకు చెందిన కొన్ని మీడియాలకు సమాచారం లీక్ చేశారు. అయితే ఈ విషయాన్ని ఎక్కువ మంది నమ్మడం లేదు.
ఆయన గతంలో కాంగ్రెస్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. తర్వాత బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా వినిపించింది. కానీ టీఆర్ఎస్లో తప్ప ఎక్కడా రాజకీయం వర్కవుట్ కాదని ఆగిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్లో ఏదో ఓ చోట టిక్కెట్ హామీ ఇస్తే ఆయన ఉండటానికి సిద్ధమే. కానీ టీఆర్ఎస్లో అంత స్పేస్ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో లేదు. అందుకే చివరికి ఆయన ఏదో ఓ పార్టీ చూసుకుని వెళ్లిపోవాల్సిందేనని.. ఆయనను బుజ్జగించడం కూడా వేస్ట్ అని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.