ఆర్.ఆర్.ఆర్ కొత్త రిలీజ్ డేట్లు వచ్చేశాయి. మార్చి 18 లేదంటే… ఏప్రిల్ 28న ఈసినిమాని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఇది ఊహించిన పరిణామమే. ఎందుకంటే ఏప్రిల్ 28న ఆర్.ఆర్.ఆర్ విడుదల అవుతుందని ట్రేడ్ వర్గాలు ముందే ఊహించాయి. ఆర్.ఆర్.ఆర్ కి తగిన స్లాట్ అక్కడే ఉంది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ చెప్పేసి, చేతులు దులుపుకున్నాడు గానీ, ఇప్పుడు మిగిలిన సినిమాలన్నీ ఒత్తిడిలో పడిపోయాయి. ముఖ్యంగా రాధేశ్యామ్.
టాలీవుడ్ లో తెరకెక్కిన రెండు భారీ చిత్రాలు ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్. రెండూ పాన్ ఇండియా సినిమాలే. రెండూ సంక్రాంతికి వద్దామనుకుని వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలూ వీలైనంత త్వరగా రావాలి. లేదంటే.. వడ్డీల భారం మోయలేక ఇబ్బంది పడాల్సి వుంటుంది. అందుకే ముందుగా రాజమౌళి రంగంలోకి దిగిపోయాడు. తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశాడు. ఒక డేట్ ఫిక్సయితే బాగానే ఉండేది. రెండు డేట్లు లాక్ చేసేశాడు. మరి రాధే శ్యామ్ ఎప్పుడు రావాలి..? నిజానికి మార్చి 18న వద్దామని రాధే శ్యామ్ ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని డిస్టిబ్యూటర్స్కీ చూచాయిగా చెప్పింది. సడన్ గా ఆ డేట్ కూడా లాగేసుకుంది ఆర్.ఆర్.ఆర్. ఇప్పుడు కచ్చితంగా మార్చి తొలి వారంలో లేదంటే.. ఏప్రిల్ ద్వితీయార్థంలో రాధే శ్యామ్ రావాలి. మార్చి 18న ఆర్.ఆర్.ఆర్ ఫిక్సయితే.. మార్చి తొలి వారంలో రాధేశ్యామ్ వస్తుంది. లేదంటే.. ఏప్రిల్ రెండు, లేదా మూడో వారంలో రావాలి. ఆర్.ఆర్.ఆర్ కంటే ముందే తమ సినిమాని విడుదల చేయాలని రాధే శ్యామ్ భావిస్తోంది. కాబట్టి రిలీజ్ డేట్ల విషయంలో త్వర పడాలి.
ఆర్.ఆర్.ఆర్ ప్రభావం ఆచార్యపై కూడా పడింది. మార్చి 18న ఆర్.ఆర్.ఆర్ వస్తే ఏప్రిల్ 1న ఆచార్య రావొచ్చు. ఎందుకంటే.. ఆర్.ఆర్.ఆర్ విడుదలైన తరవాతే… ఆచార్య రావాలన్నది ఓ ఒప్పందం. ఏప్రిల్ 28న వస్తే మాత్రం.. కచ్చితంగా ఆచార్యని మేలో విడుదల చేసుకోవాలి. మార్చి 18, ఏప్రిల్ 28 మధ్యలో రావల్సిన సినిమాలు ఇప్పుడు తప్పకుండా స్ట్రగుల్ అవ్వబోతున్నాయి. ఈ రెండు డేట్లలో ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేకపోవడం వల్ల, మిగిలిన సినిమాల రిలీజ్ డేట్లు పూర్తిగా డిస్ట్రబ్ అవ్వబోతున్నాయి.