ప్రభాస్ చేతినిండా సినిమాలే. ఊపిరి సలపనంత బిజీ. 2025 వరకూ ప్రభాస్ మరో నిర్మాతకు కాల్షీట్లు ఇచ్చే పరిస్థితులో లేడు. కానీ.. ప్రభాస్ కోసం మాత్రం కొత్త కథలు తయారవుతూనే ఉన్నాయి. తాజాగా మారుతి ప్రభాస్ కోసం ఓ కథ రెడీ చేసినట్టు, డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో నయా గాసిప్ వినిపిస్తోంది. మారుతి ఎప్పుడో బిగ్ లీగ్ లోకి చేరిపోయాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. చిరంజీవితో కూడా ఓ సినిమా ఉందని, కథ రెడీ అవుతోందని ఓ టాక్ వినిపించింది. ఇప్పుడు ప్రభాస్ ఓ సినిమా అంటే.. మారుతి సెటప్ స్ట్రాంగ్ గా ఉన్నట్టే.
అయితే.. ప్రభాస్ తో సినిమా అనేది ప్రస్తుతానికి చర్చల్లోనే ఉందని సమాచారం. ఇటీవల దానయ్య – మారుతిల మధ్య ఓ కీలకమైన మీటింగ్ జరిగింది. అందులో సినిమా చేయడం గురించి మాట్లాడుకున్నారు. డివివి దానయ్యకు ప్రభాస్ ఓ సినిమా చేయాల్సివుంది. అలా.. ఈ కాంబో సెట్ అవ్వడానికి మార్గం దొరికింది. కాకపోతే… ఈ కథ ప్రభాస్ దగ్గరకు వెళ్లాలి, ఆయన వినాలి, ఓకే అనాలి… ఇంత తతంగం ఉంది. ప్రభాస్ చేతిలోఉన్న సినిమాలు, చేస్తున్న ప్రాజెక్టుల నేపథ్యంలో మారుతికి అంత ఈజీగా కాల్షీట్లు దొరక్కపోవొచ్చు. మారుతికి కూడా ఇదో ఆప్షన్ మాత్రమే. రవితేజ, చిరంజీవి.. ఇలా ఆయన కూడా మంచి లైనప్పే సెట్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాలు అయ్యేలోగా.. ప్రభాస్‌కి మధ్యలో ఏమైనా గ్యాప్ వస్తే, ఆ గ్యాప్‌లో మారుతి సినిమా చేయగలడు అనిపిస్తే.. అప్పుడే ఈ కాంబో సెట్‌కి వెళ్తుంది. అప్పటి వరకూ ఈ కాంబో పేపర్ పై మాత్రమే కనిపిస్తుంది.