వైఎస్సార్ పార్టీ ఎంఎల్ఎలు మరో పది మంది వరకూ తమ లోకి వచ్చే అవకాశం వుందని తెలుగుదేశం నేతలు లెక్కలు చెబుతున్నారు. అందులో అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచి, తర్వాత ప్రకాశం కృష్ణా జిల్లాల నుంచి వస్తారంటున్నారు. ఈ మేరకు ఎంఎల్ఎల పేర్లు కూడా చలామణిలో వున్నాయి. ఇవన్నీ ‘వర్కవుట్’అయితే ఇతర చోట్ల ఆ ప్రభావం పడుతుందని ఆశపడుతున్నారు. కాని అంత సీన్ లేదనీ, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భూమా కుటుంబం మారినంత మాత్రాన మిగిలిన వారంతా దూకేస్తారని అనుకోవద్దని వైసీపీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి మొదటి విడతలో ఎనిమిది మంది వచ్చేస్తారన్న టిడిపి నలుగురిని మాత్రమే చేర్చుకోగలిగిందని గుర్తు చేస్తున్నారు. ఇందులోనూ ఆదినారాయణ రెడ్డి ఫిరాయింపు ఎప్పటినుంచో తెలిసిన వ్యవహారమేనని, జలీల్ ఖాన్ ఒక్కడే అదనంగా వెళ్లినట్టు భావించాలని అంటున్నారు. సుజయ రంగారావు వెళ్తాడన్న ప్రచారం ఆచరణలో తేలిపోయిన తీరే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. రెండేళ్ల తర్వాత తెలుగుదేశంపై అసంతృప్తి పెరుగుతున్నప్పుడు వీరంతా దాంట్లో చేరినందుకు విచారించే రోజు త్వరలోనే వస్తుందని జోస్యం వినిపిస్తున్నారు.
అయితే పార్టీ నుంచి ఫిరాయించేవారి పట్ల అద్యక్షుడు జగన్ వైఖరి కూడా బాగాలేదని వైసీపీ నేతలు వాపోతున్నారు. పోతే పోనీ పోరా తరహాలో ఆయన వున్నాడే గాని ఎలాగైనా ఆపాలనే తాపత్రయం లేదు. భూమాకు నచ్చజెప్పేందుకు వైవీసుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారు స్వంతంగా వెళ్లారే గాని జగన్ దూతలుగా కాదు. ఎవరు పోయినా నాకేం ఫర్వాలేదు నన్ను చూసి జనం ఓటేస్తారన్న అతి భరోసాతో జగన్ పరిస్థితి దిగజారడానికి కారకులవుతున్నారని ఆయనను అభిమానించేవారే అంటున్నారు. ఇంత మంది పోయినా తన పనివిధానం గురించి పునరాలోచించే బదులు ఏకవ్యక్తి వ్యవహారమే సాగిస్తున్నారనేది వారి విమర్శ. కాస్త మెళకువ తెచ్చుకుని పార్టీ ప్రజా ప్రతినిధుల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే మరింత మంది వెళ్లిపోవచ్చని కూడా ఇలాటి వారు హెచ్చరిస్తున్నారు. ఇంత జరిగినా మా మాట వినడం లేదు. సలహాలు స్వీకరించడం లేదు. ఇంకేం చేస్తాం? అని ఒక నాయకుడు ప్రశ్నించారు. నేనొక్కణ్ని వుంటే చాలన్న వైఖరితోనే అధికారం కొద్దిలో పోగొట్టుకున్న జగన్ ఇప్పటికీ తనను తాను ముఖ్యమంత్రిగా వూహించుకోవడం, మీకే పదవులు కావాలని అప్పుడప్పుడూ అడుగుతుండడం హాస్యాస్పదమని మరో నేత చెప్పారు. తను చెప్పినా ఎవరూ ఆగరని తెలుసుగనకే జగన్ నిర్లక్ష్యం నటిస్తున్నారనేది ఎక్కువమంది అభిప్రాయం.