ఏపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకానికి జగనన్న గోరుముద్ద పథకం పేరుతో అమలు చేస్తున్నారు. అందులో మెనూ ప్రత్యేకంగా ఉంటుంది. ఆ మెనూ ప్రకారం ఇస్తున్నారో లేదో తెలియదు కానీ.. అది చాలా ఘనంగా ఉంటుంది. ఈ మెనూ ప్రకారం గురువారం కిచిడి, టమోట చట్నీ, ఉడికించిన గుడ్డు ఇస్తూ ఉంటారు. అయితే హఠాత్తుగా ఈ మెనూ మార్చాలని నిర్ణయించారు. ఇడ్లీ, సాంబార్ పంపిణీ చేయాలనుకుంటున్నారు. అనుకున్నదే తడవుగా తాడేపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని అమలు చేయడం ప్రారంభించారు.
ప్రతి గురువారం పిల్లలకు మధ్యాహ్న భోజనం ఉండదు. దానికి బదులుగా నాలుగు ఇడ్లీలు, సాంబార్ ఇస్తారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మాత్రం ఐదు ఇడ్లీలు ఇస్తారు. ఉదయం పూట టిఫిన్‌గా మాత్రమే ఇడ్లీలు తింటారని పిల్లలకు తెలుసు. మధ్యాహ్నం అన్నం తింటామని వారు చదువుకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఇడ్లీలను అలవాటు చేయడానికి సిద్దపడటం వారిని కూడా ఆశ్చర్య పరుస్తోంది. కిచిడీ, ఎగ్ , టమాటా చట్నీకి ఉండేంత పోషకాలు ఇడ్లీల్లో ఉంటాయా అన్న సందేహాలు.. పౌష్టీకాహార నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
కిచిడి, టమాటా చట్ని, ఎగ్ పెట్టాలంటే చాలా ఖర్చవుతుంది.. ఇడ్లీలతో అయితే సింపుల్‌గా అయిపోతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల గోరుముద్ద పథకంపై రాష్ట్ర ప్రభుత్వానికి స్మృతి ఇరానీ లేఖలు రాశారు. పథకం నిధుల లెక్కలు చెప్పాలన్నారు. ఈ క్రమంలో మెనూ మార్పు నిర్ణయాలు బయటకు రావడం ఆశ్చర్య పరుస్తోంది.