హుజురాబాద్ ఎన్నికలు అయిపోయిన రెండున్నర నెలల తర్వాత దళిత బంధు పథకం విషయంలో కేసీఆర్ మరో ప్రకటన చేశారు. నిజానికి గత డిసెంబర్‌లోపే హుజురాబాద్‌తో పాటు నాలుగు దిక్కులా ఉన్నా నాలుగు మండలాల్లో దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. మార్చిలోపు అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో వంద మంది చొప్పున ఇస్తామన్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంటపోయారు.
ఇప్పుడు మళ్లీ కలెక్టర్లకు కొత్త ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో యూనిట్‌కు 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయమని సీఎం కేసీఆర్ అధికారులకు తెలిపారు. లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్నే ఎంపిక చేయాలన్నారు. ఎమ్మెల్యేల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని చూచించారు. లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఆమెదించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్లు కేటాయించామని … ఈ నిధుల్లో ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేశామన్నారు.
మిగతా నిధులను విడతల వారీగా విడుదల చేస్తామని ప్రకటించారు. దళిత బంధు పథకం అమలు కోసం విపక్షాలు ఉద్యమం చేసే ఆలోచనలో ఉండటంతో హఠాత్తుగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే పథకం ముందుకు నడుస్తుందా.. లేదా అన్నదానిపై మాత్రం ఎవరికీ స్పష్టత లేకుండా పోయింది.