హైదరాబాద్: ఎంతైనా వైసీపీకి చెందిన ఐదుగురు ప్రజాప్రతినిధులు వెళ్ళటం ఆ పార్టీ కరపత్రిక సాక్షికి కంటగింపుగానే ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడుపై, పార్టీ ఫిరాయించిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలపై సాక్షి ఇవాళ నిప్పులు చెరిగింది. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డిని విమర్శిస్తూ ఒక వార్త ఇచ్చింది. భూమా గతంలో టీడీపీనుంచి బయటకొచ్చినపుడు చెప్పిన మాటలను ఆ వార్తలో గుర్తుచేసింది. టీడీపీలో తమకు అవమానం జరిగిందంటూ నాడు చంద్రబాబు నాయుడువద్ద ఏడ్చినట్లు భూమా చెప్పారని రాసింది. అయినా చంద్రబాబు పట్టించుకోలేదని, కనీసం ఓదార్చను కూడా ఓదార్చలేదని భూమా అన్నట్లు పేర్కొంది. పార్టీకోసం ఇన్ని సంవత్సరాలు పనిచేసినా దగ్గరకు తీసుకోలేదని, ప్రతిదానికీ రాజకీయం చేశారని, పార్టీలో సిన్సియర్‌గా పనిచేస్తే దక్కిన గౌరవం ఇదేనని భూమా అన్నట్లు రాసింది. ఇతర పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వెళితే ఏ పాటి గౌరవం ఉంటుందో నాగిరెడ్డి తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని సూచించింది. మనస్సాక్షి ఉన్న రాజకీయ నాయకులు వేళ్ళమీద లెక్కపెట్టేటంతమంది మాత్రమే ఉంటారని ‘సాక్షి’కి తెలియకపోవటం విచారకరం!