ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన ఇంతకు ముందు వరకూ ప్రతి విషయాన్ని మీడియాతో చెప్పే బాధ్యత తీసుకునేవారు. చంద్రబాబుకు కౌంటర్ఇచ్చే బాధ్యత కూడా ఆయనే తీసుకునేవారు. పీఆర్సీ అంశం పూర్తిగా ఆయనే హ్యాండిల్ చేశారు. అనేక సార్లు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఇప్పుడు పరిస్థితి ఒక్క సారిగా చేయి దాటిపోయింది. ఉద్యోగులు సమ్మెకు వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం తెర ముందుకు సజ్జల రామకృష్ణారెడ్డి రావడం లేదు. ఇతర మంత్రుల్ని పంపి… అన్ని రకాల కామెంట్లు చేయిస్తున్నారు.
ఇప్పుడు సజ్జల తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. వైసీపీలోనూ ఇదే టాపిక్ అందరి మధ్యలోనూ వస్తోంది. అధికారవర్గాల్లో జగన్ కన్నా సజ్జలకే పలుకుబడి ఎక్కువ. ఎందుకంటే ఎక్కువగా ఆయన చేతుల మీదుగానే సాగుతూ ఉంటాయి. కానీ చివరికి వచ్చే సరికి వైఫల్యం ఏమైనా ఉంటే… అది ఆయన మీదకు రాకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ ఉద్యోగుల అంశం చిన్నదిగా లేదు.. చాలా పెద్దదైపోయింది.
అన్ని రకాల ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందుల్లో పడినట్లే అవుతుంది. ఇప్పుడు సజ్జల జోక్యం చేసుకుని.. ఏదో ఒకటి చేయాల్సింది పోయి సైలెంటయ్యారు. ఉత్తుత్తికే వేసివట్లుగా చెబుతున్న కమిటీలో ఆయనో మెంబర్గా చెబుతున్నారు కానీ.. ఆ కమిటీలో ఉందో లేదో.. తెలియదని.. కేబినెట్లో నిర్ణయం తీసుకోలేదని పేర్ని నాని చెబుతున్నారు. మొత్తం వ్యవహారం డీల్ చేసింది సజ్జల కాబట్టి… బాధ్యత కూడా ఆయనే తీసుకోవాలన్న చర్చ కూడా వైసీపీలోనే నడుస్తోంది.