సలహాదారులకు లక్షల్లో జీతాలిస్తే ఊద్యోగుల జీతాల కోత పెట్టడం ఏమిటని గగ్గోలు రేగుతున్న సమయంలో ప్రభుత్వం నుంచి జారీ అయిన మరో ప్రకటనఅందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ప్రైవేటు ఆర్థిక సంస్థల్లో పని చేసి పెద్ద ఎత్తున అనుభవం గడించినవారు రాష్ట్రానికి సేవలు అందించేందుకు కావాలని ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సలహాదారులు ఒకొక్కరికి నెలకు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వేతనం ఇస్తారు. అందరికీ జాయింట్ సెక్రటరీల హోదా ఇస్తారు. ప్రభుత్వం రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. అయితే మూడేళ్ల కాలానికి నియమిస్తామని చెబుతోంది. మంచి సలహాలిస్తే మరో రెండేళ్లు పొడిగిస్తామని చెబుతున్నారు.
సలహాదారులకు ఎలాంటి అనుభవం కావాలంటే ఏడేళ్లపాటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలలో, ప్రభుత్వ లేదా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలు లేదా పబ్లిక్ పాలసీ కన్సల్టెంట్లలో కనీసం పదేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులు. ఈ నియామకాలకు మోడీ స్ఫూర్తి అని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మూడేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ నిపుణులను డైరెక్టర్ స్థాయిలో జాయింట్ సెక్రటరీలుగా నియమించారని అందుకే ఇప్పుడు అమలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
ఈ ఆర్థిక సలహాదారుల ప్రధాన విధుల్లో ఒకటి ఖర్చుల తగ్గింపు. బోలెడంత ఖర్చు పెట్టి సలహాదారుల్ని నియమించుకుని ఖర్చు ఎలా తగ్గిచాలనే సలహాలను తీసుకుంటారు. కొత్త ప్రాజెక్టుల ఎంపిక చేయడంతోపాటు డిపిఆర్ల రూపకల్పన, ప్రణాళికల రూపకల్పన, సరికొత్త ఆర్థిక విధానం ఇలాంటి వాటిపై సలహాలివ్వాలని అంటోంది. ధరఖాస్తు చేసుకున్న వారి ఇంటర్యూల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే ఎవరెవరో కావాలో ప్రభుత్వం నిర్ణయించేసుకుని ఉంటుందని ఇదంతా ఉత్త ప్రక్రియ అనే అంచనాకు వస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న ఆర్థిక శాఖ అధికారులు సులువుగా చేసే పనిని లక్షళ జీతాలిచ్చే సలహాదారులతో చేయించాలనుకోవడమే.. ప్రభుత్వ దుబారా ఆలోచనలకు నిదర్శనమని విమర్శలొస్తే అది విమర్శించేవారి తప్పు కాదు !