సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పరిస్థితిపై కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇటీవలి కాలంలో గజ్వేల్‌లో విపక్ష పార్టీల కార్యకర్తల కార్యక్రమాలు పెరిగిపోయాయి. కొన్నింటిని పోలీసుల సాయంతో అడ్డుకున్నప్పటీకీ.. పరిస్థితి అంత సానుకూలంగా లేదని టీఆర్ఎస్కు అర్థమైంది. దీంతో కేసీఆర్ ఈ ఆదివారం మొత్తం ఫాంహౌస్‌లో మకాం వేసి.. గజ్వేల్ నియోజకవర్గంపై చర్చలు జరిపారు. కేసీఆర్‌కు గత రెండు ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిపోయిన వంటేరు ప్రతాప్‌రెడ్డితో పాటు చాలా కాలం పాటు అధికారి హోదాలో గజ్వేల్‌ను చూసుకున్న మాజీ కలెక్టర్.. ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయి.. ప్రారంభించినవి ఎందుకు ఆలస్యమవుతున్నాయన్న అంశాలపై ఆరా తీశారు. ఇళ్లు లేనివారికి ఇళ్ల కేటాయింపు, గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. అభివృద్ధి విషయంలో గజ్వేల్‌కు కాస్త గుర్తింపు ఉంది. సీఎం నియోజకవర్గం అయిన తర్వాత కొన్ని నిర్మాణాలు చేశారు.
అయితే అవననీ గత ఆరేడేళ్లుగా సాగుతూనే ఉన్నాయని… పూర్తయినవి ఏవీ లేవన్న అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తోంది. దీన్ని అధికార పార్టీ గుర్తించింది. సాధారణంగా ఎన్నికలు జరిగితే… ఇక వచ్చే ఏడాది చివరి లోనే జరగనున్నాయి. మరో ఏడాదిన్నర మాత్రమే ఎన్నికల గడువు ఉంది. ఒక వేళ ముందస్తుకు వెళ్తే మరింత తక్కువ వ్యవధి ఉంటుంది. అందుకే కేసీఆర్ గజ్వేల్‌లో అభివృద్ధి పరంగా ఎలాంటి అసంతృప్తి ప్రజల్లో లేకుండాచూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.