టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌కి రంగం సిద్ధం అవుతోంది. అదే… ప్రభాస్ తో మారుతి. బిగ్ లీగ్‌లోకి వెళ్లడానికి మారుతి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. టాప్ 5 హీరోలలో ఒకరితో సినిమా చేయాలన్నది తన తపన. తనకు అత్యంత సన్నిహితుడైన అల్లు అర్జున్ తో సినిమా చేస్తే… బిగ్ లీగ్ లోకి వెళ్లిపోవొచ్చు. కానీ.. అందుకు తనే కావాలని టైమ్ తీసుకుంటున్నాడు. ఈలోగా చిరంజీవి, ప్రభాస్‌లకు టచ్‌లో వెళ్లాడు. చిరు – మారుతి సినిమా పట్టాలెక్కబోతోందని కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ పేరు గట్టిగా వినిపిస్తోంది.
యూవీ క్రియేషన్స్‌తో మారుతికి మంచి అనుబంధం ఉంది. దాంతో ప్రభాస్ కి టచ్ లోకి వెళ్లాడు మారుతి. ప్రభాస్ కూడా… మూడు నెలల పాటు జాలీగా, ఆడుతూ పాడుతూ చేసేసే ఓ కథ కోసం అన్వేషిస్తున్నాడట. అలాంటి కథలు మారుతి బాగా చేయగలడని ప్రభాస్ నమ్మకం. ఫైట్లూ, యాక్షన్ సీక్వెన్స్.. ఇలాంటి హంగామా ఏమీ లేకుండా కేవలం ఫన్ రైడ్‌గా ఉండే సినిమా చేయాలన్నది ప్రభాస్ ఉద్దేశ్యం. మారుతికి కూడా ప్రభాస్ చెప్పింది అదే. పైగా ఈ సినిమాని మూడంటే మూడు నెలల్లో పూర్తి చేయాలి. `పాన్ ఇండియా` అనే భారం పెట్టుకోకుండా కథ తయారు చేయమని, అవసరమైతే.. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేద్దామని, లేదంటే.. తెలుగుకి మాత్రం పరిమితం చేస్తే చాలని ప్రభాస్ అన్నాడట. మారుతి కూడా దానికి రెడీ అయిపోయాడని సమాచారం.