స్టీల్ ప్లాంట్ ఉద్యోగులూ యాక్టివ్ అవుతున్నారు. రాష్ట్ర బంద్ సహా అనేక ఆందోళన కార్యాక్రమాలు ప్రకటించారు. వచ్చే నెల పదమూడో తేదీకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం బయటకు వచ్చి ఏడాది అవుతుంది. అప్పుడే ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంగా తాము ఏ మాత్రం వెనక్కి తగ్గలేదని నిరూపించడానికి ఉ్దయోగ సంఘాలు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 13న విశాఖలో ఉన్న బీజేపీ కార్యాలయం ముట్టడించి.. 23న రాష్ట్ర బంద్ నిర్వహించాలని నిర్ణయించారు.
ఉక్కు పరిశ్రమ ఏడాది పూర్తయ్యే సమయంలో పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.. ఫిబ్రవరి 1 నుంచి 7వ తేదీ వరకు కోటి సంతకాల సేకరణ చేపడతారు. ఓ వైపు ఉద్యోగులు ఏడో తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించిన సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు కొత్త శక్తి వచ్చినట్లయింది. వారితో పాటు తాము ఉద్యమం చేస్తే.. కేంద్రం దిగి వస్తుందని భావిస్తున్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేస్తుందన్న ఆశతో ఉన్నారు. కానీ వారి ఆశలు ఇప్పటి వరకూ ఫలించలేదు.
స్టీల్ ప్లాంట్ విషయంలో ఇటీవల పవన్ కల్యాణ్ కూడా మద్దతు పలుకుతున్నారు. ఓ బహిరంగసభ..మరో దీక్ష నిర్వహించారు. అన్ని పార్టీలూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకూ స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు.. వైసీపీ నేత విజయసాయిరెడ్డిని నమ్ముకుని ఉన్నారు. ఈ కారణంగా చాలా మంది దూరమయ్యారు. ఇప్పుడు వారిని దూరం పెట్టి అందర్నీ కలుపుకుని వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది .. లేకపోతే ఏమీ ఉండదన్న అంచనాలు ఉన్నాయి. అంతా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల చేతుల్లోనే ఉందంటున్నారు.