వైసీపీ నేతలు అక్రమ మైనింగ్‌తో కుప్పంను తవ్వేస్తున్నారని ఈ నెల ప్రారంభంలో చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనలో ఆరోపించారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర ప్రమాదకర ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు అక్కడ క్వారీ జరుగుతున్న తీరును చూసి ఆశ్చర్యపోయారు. ఎలాంటి అనుమతులు లేకుండా నియోజకవర్గంలోని శాంతిపురం, గుడుపల్లె మండలాలలో పెద్ద ఎత్తున క్వారీలు జరుగుతున్నట్లు స్థానిక ప్రజలు ఆధారాలను కూడా ఇచ్చారు. దీనిపై టీడీపీ అధినేత ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు.
అయితే అక్కడ అక్రమ మైనింగేమీ లేదని వెంటనే వైసీపీ నేతలు రివర్స్ అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డితోపాటు మైనింగ్ మంత్రి కూడా అదే మాట చెప్పారు. కానీ మూడు వారాలు గడిచేప్పటికి పరిస్థితి మారిపోయింది. పెద్ద ఎత్తున మైనింగ్ అధికారులు కుప్పంలో అక్రమ మైనింగ్‌పై దృష్టి పెట్టారు. నాలుగు బృందాలుగా విడిపోయి క్వారీల్లో సోదాలు చేసి.. పదుల సంఖ్యలో క్వారీల్ని సీజ్ చేశారు. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని గుర్తించారు. తరలింపుకు సిద్ధంగా ఉన్న గ్రానైట్ దిమ్మెలను..వందల సంఖ్యలో లారీలను సీజ్ చేశారు.
కొద్ది రోజులుగా కుప్పం నియోజకవర్గం అంతటా మైనింగ్ అధికారులు దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు.. ఇప్పటి వరకు మైనింగ్ కు వినియోగించే నాలుగు ప్రొక్లెయినర్లు, 10 కంప్రెసర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. తరలించడానికి సిద్ధంగా ఉన్న 200 గ్రానైట్ దిమ్మెలను సీజ్ చేశారు. ఈ దాడులు మరిన్ని రోజుల పాటు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు, కాగా అధికారుల తనిఖీలతో మైనింగ్ మాఫియా ఎక్కడికక్కడ సైలెంట్ అయ్యారు.అయితే ఇది కంటి తుడుపు చర్యలేనని.. దోచుకెళ్లిపోయింది ఎంతో ఉందని టీడీపీ నేతలు అంటున్నారు.