రోగం ఏదైనా సరే మందు ఒకటే అదే.. జిందాతిలిస్మాత్ అనే ప్రకటన ఒకటి మనకు తరచూ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అదే పద్దితి పాటిస్తోంది. ఎన్ని సమస్యలు వచ్చినా పరిష్కారం ఒకటి ఉందిగా అంటూ కొత్త జిల్లాల వాదన తెరపైకి తెస్తోంది. కొద్ది రోజుల కిందట రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో సీఎం జగన్ ఎంపీలతో మీటింగ్ సందర్భంగా… అసలు స్కోపే లేకపోయినా కొత్త జిల్లాల ప్రస్తావన తెచ్చారని ఇక రెండు రోజుల్లో నోటిఫికేషన్ అని ప్రకటించేశారు. అప్పుడు అది ఆగిపోయింది.
ఇప్పుడు ఉద్యోగులంతా సమ్మెకు వెళ్తున్న సమయం, కేసినో మంటలు రేగుతున్న సమయంలో మరోసారి ఒకటి రెండు రోజుల్లో కొత్త జిల్లాలు అంటూ సీఎంవో అధికారులు మీడియాకు లీక్ ఇచ్చారు. ఇక నోటిఫికేషనే ఉందంటున్నారు. నిజానికి ఏడాదిన్నర కిందటే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ.. జిల్లాల వారీగా కమిటీల్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో నివేదికను మూడు నెలల్లో ఇవ్వాలని గడువు విధించారు. ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తర్వాత చప్పుడు లేదు.
ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయమూ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు అసలు జిల్లాల విభజన చేయకూడదన్న కేంద్రం ఆదేశాలు ఉన్నాయి. కొత్తగా జనాభా లెక్కలను కేంద్రం తీసుకోవాల్సి ఉంది. దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రకారం.. జనగణన పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న గ్రామం, మండలం, రెవెన్యూ డివిజన్, జిల్లాల సరిహద్దులను కదిలించడానికి వీల్లేదు. ఈ మేరకు భౌగోళిక సరిహద్దులు మార్చడానికి వీల్లేదంటూ రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ జారీ చేసిన ఫ్రీజ్ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నాయి. కరోనా వల్ల జనాభా లెక్కలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు.
అయితే సీఎం జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో దీని కోసం అనుమతి తీసుకున్నారని సీఎంవో వర్గాలు చెప్పడం ప్రారంభించాయి. ఓ సమస్యను తక్కువ చేయడం కోసం.. మరో సమస్యను సృష్టించుకునే విధానాన్ని ఏపీ ప్రభుత్వం పాటిస్తోంది. ఒక వేళ ఇప్పుడు సరైన కసరత్తు చేయకుండా కొత్త జిల్లాలు అనే అంశం పెట్టుకుంటే ప్రభుత్వం పూర్తిగా చిక్కుల్లో పడిపోతుందన్న అభిప్రాయం కూడా ఉంది. కానీ ఏపీ ప్రభుత్వ పెద్దలు ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు.