వాయిదా పడుతూ వస్తున్న ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ నేడు మీట నొక్కి ప్రారంభించనున్నారు.ఈ నెల పదో తేదీన కర్నూలులో భారీ సభ ద్వారా నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. కానీ అప్పటికే పూర్తి స్థాయిలో జీతాలు కూడా ఇవ్వలేకపోవడం.. ఖాజానాలో డబ్బుల్లేకపోవడంతో ఆగిపోయారు. ఇప్పుడు పన్నుల వాటాను కేంద్రం ఓ నెల అడ్వాన్స్‌గా ఇచ్చింది. నిధులు అందడంతో మీట నొక్కాలని డిసైడయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3,92,674 మంది లబ్దిదారులకు రూ. పదిహేను వేల చొప్పున జమ చేస్తారు. గత ఎన్నికల సమయలో 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత అది సాధ్యం కాదని… 45 -60 ఏళ్ల మధ్య ఉన్నవారికి ఏటా పదిహేను వేల సాయం చేస్తామన్నారు. అయితే ఈబీసీ వర్గాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. అనేక రకాల ఆంక్షలు పెట్టడంతో చివరికి లబ్దిదారులు నాలుగు లక్షల మంది కన్నా తక్కువగానే తేలారు.
అంటే నియోజకవర్గానికి రెండు వేల మంది మాత్రమే లబ్దిదారులు. గ్రామానికి నలుగురైదుగురు లబ్దిదారులు కూడా ఉండని పరిస్థితి. ఎంతో మంది అగ్రవర్ణ పేదలు ఉన్నప్పటికీ.. అనేక రకాల ఆంక్షలు పెట్టి చివరికి లబ్దిదారుల సంఖ్యను భారీగా తగ్గించారన్న విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది.అయితే అర్హులైన వారు ఎప్పుడైనా ధరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.