ఫలానా జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరు ? అంటే.. ఆ జిల్లా నేతలందరూ ముఖాలు చూసుకోవాల్సిందే. ఎందుకంటే 2018 ఎన్నికలకు ముందు నుంచే పార్టీ జిల్లా కమిటీలకు అధ్యక్షులు లేరు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజకవర్గ ఇన్చార్జిలు క్షేత్రస్థాయిలో సమన్వయ బాధ్యతలు చూస్తున్నారు. ప్లీనరీలో రాష్ట్ర కమిటీ కూర్పు, జిల్లా అధ్యక్షుల నియామక బాధ్యతలను సీఎం కేసీఆర్‌కే అప్పచెబుతూ తీర్మానాన్ని ఆమోదించారు.
అయితే కేసీఆర్‌కు తీరిక లేకపోవడంతో కసరత్తు ఎప్పటికప్పుడు వాయిదా పడూతూ వస్తోంది. ఇప్పుడు పార్టీపైనా కొంత సమయం కేటాయిస్తున్న కేసీఆర్ రాష్ట్ర కమిటీ కూర్పు, జిల్లా అధ్యక్షుల ఎంపికపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనే రాష్ట్ర కమిటీని, పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షులను ఎంపిక చేసే పనిలో కేసీఆర్ తలమునకలుగా ఉన్నారు.క్షేత్రస్థాయిలో విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు జిల్లా అధ్యక్షుల నియామకాలు ఉండాలని భావిస్తున్నారు.
నామినేటెడ్ పదవులు అందని వారిని… పార్టీ పదవులతో సంతృప్తి పరచాలని కేసీఆర్ భావిస్తున్నారు. కొంత మంది సీనియర్లకు కూడా పార్టీ పదవులు ఇవ్వాలనుకుంటున్నారు. కేబినెట్ విస్తరణకు.. పార్టీ పదవులకు లింక్ ఉంది.దీంతో కేసీఆర్ ఈ కీలకమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారోననన్న చర్చ తెలంగాణ భ వన్‌లో జరుగుతోంది