ప్రభాస్ తో మారుతి సినిమా అనే వార్త… టాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా టైటిల్, సంగీత దర్శకుడు, నిర్మాత పేర్లు కూడా బయటకు వచ్చేశాయి. మారుతి కూడా సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్టుపై స్పందించారు. `ఇవన్నీ ఊహాగానాలే. అన్నీ సమయం వచ్చినప్పుడు చెబుతా` అన్నారు. కాకపోతే.. సైలెంట్‌గా తన పని తాను మొదలెట్టేశారు. మారుతి తన సహాయ దర్శకులు, సహ రచయితలతో కలిసి… ప్రభాస్ కోసం కథ రెడీ చేయడంలో పడిపోయారు. ఇప్పటికే సగం కథ పూర్తయ్యిందని టాక్. వారం పది రోజుల్లో ఓ వెర్షన్ రెడీ చేసి, ప్రభాస్ కి వినిపించాలి. ఆ తరవాతే… ఈ కథ ని ప్రభాస్ ఓకే చేస్తే.. కాంబోకి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది. లేదంటే మరో కథ వండే పనిలో పడతారు మారుతి. ప్రభాస్ తో ఓకే అనిపించుకున్న తరవాత అధికారిక ప్రకటన ఇవ్వాలన్నది మారుతి ఆలోచన.
స్వతహాగా మారుతి మంచి రచయిత. తన కథలన్నీ ఒక్కడే రాసుకుంటాడు. సహ రచయితలు కూడా ఉండరు.కానీ ఇది ప్రభాస్ సినిమా కాబట్టి.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు టాక్. తొలిసారి… ఇద్దరు ముగ్గురు రైటర్లతో కలిసి వర్క్ మొదలెట్టారు. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటెల్ లో.. స్క్రిప్టు వండడం మొదలైంది. ఇదో హారర్ జోనర్ అని బయట టాక్ నడుస్తోంది. కానీ ఇదో ఫ్యామిలీ డ్రామా. సరదా సరదాగా మారుతి స్టైల్ లో సాగిపోయే కథ. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. ఈ సినిమాకి దానయ్యతో పాటుగా, నిరంజన్ రెడ్డి నిర్మాత అని బయట ప్రచారం జరుగుతోంది. కానీ.. ఈ సినిమాకి దానయ్యనే సోలో నిర్మాత. ఆయనే ప్రభాస్‌ని ఏక మొత్తంగా అడ్వాన్స్ ఇచ్చాడు.