ఉద్యోగ సంఘం నేతగా వ్యవహరించి రిటైరైన తర్వాత టీడీపీలో చేరి ఎమ్మెల్సీ అయిన అశోక్‌బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. అశోక్ బాబు సర్వీసులో ఉన్న సమయంలో పదోన్నతి కోసం ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలపై విచారణ జరిపిన అప్పటి ప్రభుత్వం అలాంటిదేమీ సమర్పించలేదని.. టైపింగ్ ఎర్రర్ చోటు చేసుకుందని తేల్చింది. దాంతో అప్పట్లో ఆ వివాదం ముగిసిపోయింది .
ఆయన రిటైరైపోయిన నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం మారిన రెండున్నరేళ్ల తర్వాత అశోక్ బాబు ఇలా ఫేక్ సర్టిఫికెట్ సమర్పించారని.. ఉద్యోగ సంఘాల నుంచి ఓ ఫిర్యాదు లోకాయుక్తకు వెళ్లినట్లుగా తెలు్సోతంది. దీనిపై విచారణ జరిపిన లోకాయుక్త కేసు దర్యాప్తు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈ మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే.. గతంలోనే రాజకీయంగా అశోక్ బాబుపై ఇలాంటి ఆరోపణలను వైసీపీ నేతలు చేశారు.
ఆయన వాటిని ఖండించారు. తాను ఎలాంటి ఫేక్ సర్టిఫికెట్ కూడా సమర్పించలేదన్నారు. ఇప్పుడు అదే ఆరోపణలతో కేసు పెట్టినందున ఆధారాలుంటే అశోక్ బాబుపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకపోతే.. రాజకీయ కక్ష సాధింపుల కోసమే కేసులు పెట్టారన్న భావన ప్రజల్లో ఏర్పడుతుంది.