ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మిగతా రాష్ట్రాల సంగతేమో కానీ ఈ సారి బడ్జెట్ కోసం తెలుగు రాష్ట్రాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వాలకు నిర్మలమ్మ సాంత్వన చేకూరుస్తారని నిధుల ప్రవాహం ప్రారంభిస్తారని ఆశ పడుతున్నారు. తెలంగాణ ముందస్తుగానే.. తమకేం కావాలో చెబుతూ వరుసగా లేఖలు రాస్తోంది. ఈ బాధ్యత కేటీఆర్ తీసుకున్నారు.
కానీ ఏపీ నుంచి బడ్జెట్లో ఏ కావాలో అడుగుడుతున్నసూచనలు కనిపించడం లేదు. అప్పుల అనుమతుల కోసం ఢిల్లీలో శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించడం తప్ప.. ప్రత్యేక ప్రయత్నాలేమీ లేవు. కానీ కేంద్ర పద్దులపై ఏపీ ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. కేంద్ర బడ్జెట్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు. కానీ ఎప్పటికప్పుడు అవి ప్రాధాన్యత లేని అంశాలుగానే ఉండిపోయాయి. ఎప్పటికప్పుడు బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత… ఏపీకి ఈ బడ్జెట్ బాగో లేదు కానీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పద్దులు అని ప్రకటించడం వైసీపీకి ఆనవాయితీగా మారింది. కేంద్ర బడ్జెట్లో ఈ సారి ఎంత మేర ఆశలను నెరవేరుస్తారనేది అంతుబట్టడం లేదు. ప్రస్తుత ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా … ప్రత్యేకమైన ప్రయోజనాల్ని ఏపీ ఆశిస్తోంది. కనీసం అప్పులకు అనుమతులు కోరుతోంది. అయితే కేంద్రం ఎలా స్పందిస్తుందనేది అంతుబట్టని విషయం.
అయితే తెలుగు రాష్ట్రాల గత బడ్జెట్లకు.. ప్రస్తుత బడ్జెట్‌కు పెద్ద తేడా ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది. విభజన హమీలను నెరవేర్చామని బీజేపీ నేతలు చాలా కాలంగా చెబుతున్నారు. వారి లెక్కలు వారు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల లెక్కలు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ సారి బడ్జెట్ తర్వాత కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. విభజన హామీల ప్రకారం ఏర్పాటైన కేంద్ర సంస్థలకు అవసరాల మేర నిధులు కేటాయిస్తే అదే గొప్ప విజయంగా భావించాల్సిన పరిస్థితి అనే అభిప్రాయం నిపుణుల్లో ఉంది.