ప్రధానమంత్రి నరేంద్రమోడీ రిపబ్లిక్ డే వేడుకల్లో భిన్నంగా కనిపించారు. భగత్ సింగ్ తరహా టోపీ.. ఓ విభిన్నమైన కండువాతో వేడుకల్లో పాల్గొన్నారు. టోపీపై బ్రహ్మకమలం ముద్ర ఉంది. కాసేపటికే నెటిజన్లు అవి ఎక్కడివో గుర్తు ట్టారు. బ్రహ్మకమలం చిత్రంతో ఉన్నది టోపీ ఉత్తరాఖండ్ సంప్రదాయ టోపీ. మెడలో వేసుకున్న కండువా మణిపూర్ సంప్రదాయానికి సంబంధించిన కండువా. టోపీ ఉత్తరాఖండ్ సంప్రదాయానికి చిహ్నం అయితే కండువా మణిపూర్ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది.మణిపూర్‌లోని మేటీ తెగ వినియోగించే ప్రత్యేక వస్త్రం.
ఈ రెండింటినే ఎందుకు వాడారు అంటే ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని కొంత మంది నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అక్కడి ప్రజల్ని ఆకట్టుకోవడానికి మోడీ ఇలా చేశారని విశ్లేషిస్తున్నారు. అయితే ప్రధాని మోడీ ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు. ఎప్పుడూ ఇలానే చేస్తూంటారు. గత ఏడాది మార్చిలో టీకా వేయించుకుంటున్న సమయంలోనూ అప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల సమీకరణాల్ని చూసుకున్నారు. తాను అసోం సంప్రదాయ కండువా వేసుకుని తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి నర్సులతో టీకా వేయించుకున్నారు. వారి గురించి బాగా చర్చ జరిగేలా చేశారు.
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలప్రజల్ని ఆకట్టుకోవడానికి ఇలా చేస్తారని వచ్చే విమర్శల్ని మోడీ పట్టించుకోరు. రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆయా రాష్ట్రాల సంప్రదాయ వస్త్రాలను ధరించడం ప్రధాని స్టైల్. అది రిపబ్లిక్ డే రోజునా కొనసాగించారని అనుకోవాలి.