ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ ధరల అంశం పై హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం నియమించిన కమిటీ మరోసారి ఫిబ్రవరి 2న కమిటీ భేటీ అమరావతిలో సమావఏశం కానుంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లుతో పాటు ప్రేక్షుకుల సంఘం తరపున కొంత మందికి ఆహ్వానం పంపుతారు. ఇప్పటికే రెండుసార్లు సమావేశం జరిగింది. అయితే రెండు సార్లూ పెద్దగా చర్చలు జరగలేదు. తమ తమ డిమాండ్లను ఆయా వర్గాలు ప్రభుత్వానికి వినిపించాయి. ప్రభుత్వం నియమించిన కమిటీ వాటిని నోట్ చేసుకుంది.
ఈ అంశం టాలీవుడ్ – ఏపీ ప్రభుత్వం మధ్య గ్యాప్ పెంచేసింది. ఇటీవల సీఎం జగన్ కూడా చిరంజీవితో లంచ్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా టిక్కెట్ రేట్ల అంశంతో పాటు టాలీవుడ్ సమస్యలపై చర్చించినట్లుగా చెప్పారు. కానీ ఆ తర్వాత మంత్రి పేర్ని నాని .. సీఎం జగన్తో చిరంజీవి భేటీ ఫార్మాలిటీనేనని .. పలకరింపుల కోసమేనని చెప్పారు. అధికారికం కాదన్నారు. దీంతో టాలీవుడ్లోనూ కలకలం రేగింది.
ఇప్పుడు అధికారికంగా ఉండటానికి చిరంజీవిని టాలీవుడ్ తరపున వచ్చి సమస్యలను కమిటీ ముందు చెప్పాలని ఆహ్వానించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆహ్వానం అందినా ఆయన హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. సినిమా టిక్కెట్ల అంశంపై ఫిబ్రవరి పదో తేదీన ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ లోపే కమిటీ భేటీలు పూర్తి చేసి ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని భావిస్తోంది.