కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. అందరూ ట్వీట్ల ద్వారా కోలుకోవాలని పలకరిస్తే కేసీఆర్ మాత్రం అలాంటి వాటికి భిన్నంగా నేరుగా ఫోన్ చేశారు. ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకుని జాగ్రత్తలు చెప్పారు. రెండు రోజుల కిందటే చిరంజీవికి కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోవడంతో పాజిటివ్ వచ్చింది.
దీన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన చిరంజీవి తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చిరంజీవికి కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు, లోకేష్ సహా పలువు ట్విట్టర్లో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. గతంలో చంద్రబాబు,లోకేష్ కరోనా బారిన పడినప్పుడు చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. జగన్ కూడా వారికి ట్వీట్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎలాంటి ట్వీట్ చిరంజీవి కోలుకోవాలని రాలేదు.
అయితే సీఎం కేసీఆర్ మాత్రం నేరుగా ఫోన్ చేసి క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా ఇండస్ట్రీ కోసం.. రెండు, మూడు సార్లు కేసీఆర్తో ప్రగతి భవన్లో చిరంజీవి ఇతర టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం అయ్యారు. వారి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.