తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇరిగేషన్ బాధ్యతలు చూస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్‌పై తీవ్రమైన ఆవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల రజత్ కుమార్ కుమార్తె పెళ్లి అత్యంత జరిగింది. హైదరాబాద్‌లోని పలు స్టార్ హోటళ్లలో ఐదు రోజుల పాటు పెళ్లికి సంబంధించిన సంగీత్ సహా వివిధ సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. చివరికి పెళ్లి తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగింది. అంత వరకూ బాగానే ఉన్నా.. అసలు ఈ పెళ్లి ఖర్చులన్నీ ఒక్క రూపాయికూడా రజత్ కుమార్ పెట్టుకోలేదు.
బిగ్‌వేవ్ ఇన్ఫ్రా అనే కంపెనీ మొత్తం ఖర్చులను పెట్టుకుంది. ఈ విషయం బిల్లులు, మెయిల్స్‌తో సహా “ది న్యూస్ మినిట్ ” వెబ్సైట్ వెలుగులోకి తెచ్చింది. ఆ కంపెనీ పేర్కొన్న అడ్రస్‌లో కార్యాలయం లేదు. సూట్ కేసు కంపెనీగా భావిస్తున్నారు. ఆ కంపెనీ పేరుతో మేఘా ఇంజినీరింగ్‌కు చెందిన వ్యక్తులు రజత్ కుమార్ పెళ్లి ఏర్పాట్లు చేశారు. బిగ్ వేవ్ ఇన్ ఫ్రా కంపెనీ పేరు మీద ఒక్క చెక్ ద్వారా రూ. ఇరవై మూడు లక్షలు చెల్లించారు. ఈ వివరాలన్నీ స్పష్టంగా ఉండటంతో రజత్ కుమార్ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.
మేఘా కంపెనీ తెలంగాలో అత్యంత భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టింది. ఇరిగేషన్ శాఖనే రజత్ కుమార్ చూస్తూండటంతో ఇప్పుడు ఆయనపై అనుమానాలు పెరగడానికి కారణం అవుతోంది. అయితే తన కుమార్తె పెళ్లికి మేఘా కంపెనీ ఎలాంటి ఖర్చులు పెట్టుకోలేదని రజత్ కుమార్ అంటున్నారు. అలాగే మేఘా కంపెనీ కూడా స్పందించింది. రజత్ కుమార్ కుమార్తె పెళ్లికి ఏర్పాట్లు చేసిన మేఘా ఉద్యోగులు.. వారు వ్యక్తిగతంగా చేసి ఉంటారని కంపెనీకి సంబంధం లేదని తెలిపింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపితే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
రజత్ కుమార్.. తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో సీఈవోగా ఉన్నారు. ఆయన పనితీరుపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత తెలంగాణ సర్కార్ ఆయనకు అత్యంత ప్రాధాన్యమైన పోస్టులు కట్టబెట్టింది. ఈ వివాదాస్పద ఆఫీసర్ ఇప్పుడు తీవ్రమైన చిక్కుల్లో ఇరుక్కుంటున్నట్లుగా కనిపిస్తోంది.