కృష్ణా జిల్లాను రెండు మక్కలు చేసి ఒక దానికి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెడుతున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది. చట్టపరమైన అడ్డంకులు అన్నింటినీ అధిగమించి జిల్లా ఉనికిలోకి రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్కే ఏదో పెద్ద గుర్తింపు తెచ్చామని వైసీపీకి చెందిన కొన్ని అనుబంధ మీడియా సంస్థలు గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కనీసం జగన్కు ధ్యాంక్స్ చెప్పరా అంటూ కథనాలు వండి వారుస్తున్నాయి. వీరి తీరు చూసి నెటిజన్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే .. అంత ఘనమైన గురివింద చరిత్ర వారికి ఉంది మరి !
కడపకు వైఎస్ పేరు పెట్టినప్పుడు ఆ నోట ధ్యాంక్సులు ఎందుకు రాలేదు !?
కడప జిల్లాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టినప్పుడు ఆయన కుమారుడు జగన్ అయినా.. లేకపోతే ఆయన సతీమణి విజయలక్ష్మి అయినా స్పందించడం ఎవరైనా చూశారా?. ఎవరూ చూడలేదు. కనీసం ధ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఆ పేరు పెట్టడం ఇష్టం లేదన్నట్లే ఉన్నారు. అప్పుడు సీఎంగా రోశయ్య ఉన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక సూచనల మేరకు కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు పెట్టారు. వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. అప్పట్లో సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉండేది. వైఎస్ అభిమానులంతా స్పందించారు. కానీ జగన్, విజయమ్మలు మాట వరుసకు కూడా సోనియాకు.. రోశయ్యకు ధ్యాంక్స్ చెప్పలేదు. కనీసం తమ పత్రికలో చెప్పించలేదు.
రామకృష్ణ, పురందేశ్వరి స్పందించినది తెలిసినా తెలియనట్లు ఎందుకుంటున్నారు ?
కానీ ఇప్పుడు మాత్రం రాజకీయ లబ్ది కోసం ఎన్టీఆర్ పేరు ఓజిల్లాకు పెట్టగానే జగన్కు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ధ్యాంక్స్ చెప్పరా అంటూ గురివింత తేలివితెటలు ప్రదర్శించడం ప్రారంభించారు. నిజానికి జగన్ అంత కుత్సిత మనస్థత్వంతో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు లేరు. ఆ కుటుంబం తరపున ప్రతినిధిగా ఎక్కువగా మాట్లాడే రామకృష్ణ పత్రికా ప్రకటన ఇచ్చారు. సంతోషం తెలిపారు. జగన్కు వారు కోరుకున్న ధ్యాంక్స్ చెప్పారు. బీజేపీ నేత పురందేశ్వరి కూడా అదే విధంగా స్పందించారు. కానీ వైసీపీ మీడియాకు మాత్రం ఇవేమీ కనిపించవు. తమ మూలపురుషులు చెప్పలేదు కాబట్టి వీరు కూడా అలా చెప్పరనో.. చెప్పలేదనో రచ్చ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు.
ఏదో మేలు చేసినట్లు మైలేజీ కోరుకోవడం ఎందుకు !?
ఎన్టీఆర్కు గౌరవించడం .. కృష్ణా జిల్లాను రెండు భాగాలుగా చేసి.. ఓ దానికి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెట్టడం కాదు. వైఎస్ఆర్ కడప జిల్లా అని ఉన్న పేరులో కడపను తీసేసి … వైఎస్ఆర్ జిల్లా అని ఉంచుకున్నంత ప్రేమ ఎందుకు ఎన్టీఆర్పై చూపించలేకపోయారు. ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు తగిలించి అదేదో గొప్ప ప్రఖ్యాతి తెచ్చిపెట్టమని ప్రచారం చేసుకోవడం.. ధ్యాంక్స్లు కోరుకోవడం చిల్లర పని అనిప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగుజాతి ఉన్నంత కాలం మహోజ్వలంగా వెలిగిపోయే ప్రఖ్యాతి ఆయన సొంతం. జిల్లాలకు పెట్టే పేర్లతో ఆయనకు కొత్తగా వచ్చే గౌరవం ఉండదు. ఆ విషయం గుర్తిస్తే ఆయనను గౌరవించినట్లే !