కొత్త జిల్లాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు ? .. ఇది ప్రశ్న. ప్రజలకు వీలైనంతగా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశాం. అందుకే కొన్ని పార్లమెంట్ స్థానాల్లోని నియోజకవర్గాలను పాత జిల్లాల్లోనే ఉంటాం..! ఇది సూటిగా దూసుకొచ్చిన ప్రభుత్వ సమాధానం. జిల్లా కేంద్రాలకే ఇలా ఉంటే.. మరి రాష్ట్ర రాజధాని కూడా అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండొద్దా? రాష్ట్రం మధ్యలో ఉన్న అమరావతిని కాదని ఓ మూలన ఉన్న విశాఖలో ఎలా పెడుతున్నారు ? ఇది అనుబంధ ప్రశ్న. దీనికి మాత్రం ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అది వేరు.. ఇది వేరు చెప్పి తప్పించుకోవడం మినహా మార్గం కూడా కనిపించలేదు.
ప్రభుత్వం ప్రతి విషయంలో తనకు అనుకూలంగా ఉన్న వాదనలను వినిపించడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. ఒకే రకమైన అంశాలకు రెండు భిన్నమైన వాదనలు వినిపించడానికి కూడా సిగ్గుపడటం లేదు. అప్పుడు అలా అన్నారు కదా.. ఇప్పుడు ఇలా చేస్తున్నారేమిటి అని వస్తున్న ప్రశ్నలు.. విమర్శలను దులిపేసుకుంటోంది కానీ ద్వంద్వ ప్రమాణాలను ప్రజలు చూస్తున్నారని గుర్తించలేకపోతోంది. ఒక్క రాజధాని విషయంలోనే కాదు.. దాదాపుగా ప్రతి అంశంలోనూ ఈ “రివర్స్” వ్యవహారం కనిపిస్తోంది. ఎన్ని సార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చిన కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయడం లేదు.
గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత 98 శాతం పనులు గ్రామ స్థాయిలోనే అయిపోతున్నాయని ప్రభుత్వం వాదన. మరి అలాంటప్పుడు పరిపాలనా సౌలభ్యం పేరుతో జిల్లాల విభజన ఎందుకన్నది ఎవరికీ అర్థం కాని విషయం. ఇలా ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని డొంక తిరుగుడుగానే ఉంది. తాము ఏం చేసినా ప్రజలు ఆమోదిస్తారనే ఓ అంచనాలో ప్రభుత్వం ఇలా వెరపు లేనట్లుగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజలకు ప్రభుత్వ పనితీరుపై తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఐదేళ్లకోసారి మాత్రమే వస్తుంది. అప్పుడు ప్రజలకు ఇవన్నీ గుర్తుంటే ప్రభుత్వానికి ఇబ్బందికరమే అవుతుంది.