ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులూ సమ్మె మూడ్లోకి వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికి ప్రభుత్వ ఉద్యోగులు ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె ప్రకటించారు. వారికి తోడుగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా రెడీ అన్నారు. పీఆర్సీ సాధన సమితి ఎప్పుడు ఓకే అంటే… తాము అప్పటి నుండి బస్సులు ఆపేస్తామని ప్రకటించారు. ఇప్పుడు వీరికి తోడుగా జెన్కో, ట్రాన్స్కో ఉద్యోగులు కూడా రంగంలోకి దిగారు. వారు కూడా ఆందోళనలకు దిగాలని నిర్మయించుకున్నారు.
జెన్కో, ట్రాన్స్కోలను కూడా మెల్లగా ప్రైవేటు పరం చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కేబినెట్ భేటీలో కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణ చేయాలని నిర్మయించుకున్నారు. దీన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో ఈ రెండు కార్పొరేషన్ల ఉద్యోగులకు చాలా కాలంగా జీతాలు తగ్గిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పై స్థాయి అధికారులు.. ఇంజినీర్లు స్వచ్చంద పదవీ విరమణకు ధరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల అధికారులతో చర్చలు జరిపి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.
సమస్యల పరిష్కారం కోసం మంత్రి సమక్షంలో జరిగిన ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇప్పుడా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఉద్యోగులు ఆందోళనకు సిద్దమయ్యారు. ఈ నెల 29 నుంచి వివిధ రూపాల్లో నిరసన చేపడతామన్నారు. కక్ష సాధింపులకు పాల్పడితే మెరుపు సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేపడితే చాలా సమస్యలు వస్తాయి. అందుకే ప్రభుత్వం సమ్మెలు చేపట్టకుండా ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉంటుంది.అయితే ఇప్పుడు ఉద్యోగులు నేరుగా సమ్మె అని చెప్పకుండా ఆందోళనలకు దిగుతున్నారు. తర్వాత ఉద్యోగుల సమ్మెను బట్టి తాము సమ్మెకు దిగితే.. విషయం సీరియస్ అయ్యే అవకాశం ఉంది.