ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రధానిమోడీ నిర్ణయాలు ఎలా ఉన్నా.. జై కొట్టే కొద్దీ జై కొట్టాలనిపిస్తోంది. తాజాగా ఆయన అత్యంత వివాదాస్పదమవుతున్న సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్ మార్పు విషయంలోనూ జై కొట్టేశారు. మీ నిర్ణయం అద్భుతమని.. స్వాగతిస్తున్నామని లేఖ రాసేశారు. ఇప్పుడీ అంశం ఉన్నతాధికారవర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది.
మోడీ నిర్ణయాన్ని కేసీఆర్ తీవ్రంగా ఖండిస్తే.. జగన్ “సూపర్ సార్” అనేశారు !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాంశమవుతున్న సివిల్ సర్వీస్ కేడర్ సర్వీస్ రూల్స్ విషయంలో ప్రధాని మోడీ నిర్ణయాన్ని అత్యంత ఉత్సాహంగా స్వాగతించారు. ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే నిర్ణయంగా చెబుతూ ఘాటు లేఖ రాస్తే ఆయన మిత్రుడు జగన్ మాత్రం గొప్ప నిర్ణయం అని అభిప్రాయ పంపారు. రాష్ట్ర కేడర్ సివిల్ సర్వీస్ అధికారుల్ని కేంద్రం ఎప్పడు కావాలంటే అప్పుడు పిలిపించుకునేందుకు సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేస్తోంది. అదే జరిగితే సివిల్ సర్వీస్ అధికారులు కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయినట్లే.
స్వాగతించిన ఒకే ఒక్క బీజేపీయేతర ముఖ్యమంత్రి సీఎం జగన్ !
రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా కన్నా కేంద్రం చెప్పినట్లుగా చేయడానికే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఈ అంశంపై పాజిటివ్ అభిప్రాయం చెప్పడానికి వెనుకాడుతున్నాయి. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలు మాత్రం నిస్సంకోచంగా తిరస్కరిస్తున్నాయి. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న బీహార్ కూడా కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించింది. కానీ ఏపీ సీఎంకు ఆ రూల్స్‌లో అంత పాజిటివిటీ ఏం కనిపించిందో కానీ గొప్ప నిర్ణయం అని అంగీకరించారు. ఆ లేఖలో స్వాగతిస్తున్నామని చెప్పేసిన తర్వాత .. తమ గురించి కూడా కాస్త పట్టించుకోవాలని జగన్ కోరారు. కానీ అలాంటివి పట్టించుకోకుండా ఉండటానికే ఈ రూల్స్ తెస్తున్నారని సాధారణ జనానికి కూడా అర్థమైపోతుంది.
వ్యతిరేకించలేని నిస్సహాయతే కారణమా !?
సీఎం జగన్‌కు అర్థం కాలేదని అనుకోలేం. మొత్తంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అడ్డంగా తల ఊపడం తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు.. రాష్ట్ర అధికారాలు లాక్కుంటున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం పడిపోయిందని మరోసారి తేలిందన్న విమర్శలు ఈ లేఖ ద్వారా మరోసారి జగన్ ప్రభుత్వం పై వస్తాయి. అయితే ఇలా రావడం కొత్తేమీకాదు కాబట్టి ఏపీ అధికార పార్టీ లైట్ తీసుకునే అవకాశం ఉంది.