జగన్ సంగతి తెలుసుగా… ఇంకెందుకు సమ్మె ? .. అని అని అన్యాపదేశంగా ఏపీ ఉద్యోగులకు ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తన వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకు ద్వారా సందేశం పంపించారు. రెండు వారాల విరామం తర్వాత కొత్తపలుకు ద్వారా ఆయన తన అభిప్రాయాలను.. విశ్లేషణలను మళ్లీ పంచుకున్నారు. అయితే ఆయన తన సహజశైలికి భిన్నంగా ఉద్యోగుల్ని మరింతగా రెచ్చగొట్టలేదు. వారికి వీలైనంత మంచి చెప్పే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా శైలీ ఎలా ఉందో విడమర్చి చెప్పారు. ఈ విషయం ఉద్యోగులకు తెలియదని కాదు.. కానీ ఆయన మరోసారి చెప్పారు. చెప్పినదంతా చెప్పి.. ఉద్యోగులు సమ్మె విషయంలో పునరాలోచించుకవోడం మంచిదని చెప్పేశారు.
ఉద్యోగులు సమ్మెకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఒకటో తేదీ తర్వాత ప్రభుత్వం జీతాలు జమ చేసే ఉద్దేశంలో లేదు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై.. కొత్త అప్పులు తీసుకునే అవకాశం వచ్చే వరకూ జీతాలకు నిధులు పుట్టే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ఉద్దేశంతో ఉద్యోగుల్ని మరింతగా రెచ్చగొట్టి వారిని సమ్మెకు వెళ్లాలా జగన్ చేస్తున్నారనేది ఆర్కే విశ్లేషణ. అందుకే ఓ వైపు చర్చలంటూ.. చర్యలకు సిద్ధమవడం.. తగ్గిపోతున్న జీతాలను విడుదల చేయడం వంటివి చేస్తున్నారని అంటున్నారు. సమ్మె చేస్తే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాలు వ్యవహరించినట్లుగా సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా కూడా పరిగణనించరని పైసా కూడా ఇవ్వరని ఆర్కే హెచ్చరిస్తున్నారు.
ఒక సమస్యను మరుగు పర్చడానికి ఇంకో సమస్యను నెత్తి మీద వేసుకుంటున్న జగన్ తీరును ఆర్కే విశ్లే్షించారు కానీ అది తనదైన శైలిలో లేదు. జిల్లాల విభజన అంశంలో జగన్ వ్యూహాలేమిటో చెప్పలేదు కానీ.. జిల్లాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మాత్రం తెలంగాణ అనుభవనాన్ని కళ్ల ముందు ఉంచారు. కొత్తజిల్లాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనాలేమిటో ఎవరికీ తెలియదు. పైగా జోన్ల వివాదంతో ఉద్యోగ నియామకాల్లేవు. ఉద్యోగుల బదిలీలు ప్రాణసంకటంగా మారాయి.
ఉద్యోగులు సమ్మెకు వెళ్తేలా చేస్తున్న ప్రభుత్వం ఆ తర్వాత ప్రజల్ని వారిపై రెచ్చగొట్టేందుకు సిద్ధమవుతోదని గుర్తు చేశారు. అది సక్సెస్ అవుతుందా లేదా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా.. అంతిమంగా జగన్ చర్యల వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. అలాగే సమ్మెకు వెళ్తే ఇంకా నష్టపోతారు. ఆ విషయం తెలుసుకుని ఉద్యోగులు మసలుకోవాలని.. సమ్మెకు వెళ్లవద్దని తన కొత్తపలుకు ద్వారా సలహా ఇచ్చారు.