తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మళ్లీ మిలియన్ మార్చ్ మీద దృష్టి పెట్టారు. గత ఏడాది నవంబర్లోనే రెండు సార్లు మిలియన్ మార్చ్ నిర్వహించాలని ప్రయత్నించారు కానీ వివిధ కారణాలతో వాయాా వేసుకోవాల్సి వచ్చింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని నిరుద్యోగులతో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని బండి సంజయ్ చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ట్యాంక్ బండ్ మీద జరిగిన ఆ మిలియన్ మార్చ్ ను ఎంతో మంది గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై పోరాటానికి బీజేపీ అదే మిలియన్ మార్చ్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇటీవల నిరుద్యోగులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూడటంతో ఉద్యమమం చేయాలని నిర్ణయించుకున్నారు. నిరుద్యోగుల విషయంలో తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే యువతలో అసంతృప్తి ఉంది. దీన్ని ఆధారంగా మిలియన్ మార్చ్ సక్సెస్ చేసి.. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయశక్తిగా నిరూపించాలన్న పట్టుదలతో ఉన్నారు.
బీజేపీ ప్రయత్నాలకు టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఎన్నికలలో గెలిచి ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. పధ్నాలుగు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. అనేక ఉద్యోగాలు పోయేలా విధానాలు అవలంభించారని .. మిలియన్ మార్చ్ తెలంగాణలో కాదని.. ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా మిలియన్ మార్చ్ ని బీజేపీ సక్సెస్ చేస్తే బీజేపీకి మరో అడ్వాంటేజ్ వచ్చినట్లే.