తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కనీసం 30 లక్షల మందిని కాంగ్రెస్ సభ్యులుగా చేర్చి హైకమాండ్ వద్ద మార్కులు కొట్టేయాలనుకుంటున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా టార్గెట్ పెట్టి పార్టీ నేతలందర్నీ పరుగులు పెట్టిస్తున్నారు. కానీ చాలా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు మాత్రం సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో సభ్యత్వ నమోదు నత్త నడకన సాగుతోంది. తన నియోజకవర్గం కొడంగల్‌లో ఏకంగా 70వేల సభ్యత్వాలు చేయించి సత్తా చాటారు. అలాగే రేవంత్ వర్గీయులుగా పేరు పడిన నియోజకవర్గాల్లో ఇరవై నుంచి 30వేల వరకూ చేయించేందుకు శ్రమిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 30వేల టార్గెట్ రేవంత్ రెడ్డి పెట్టారు.
వీలైనంత వరకూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా పరిస్థితి దారుణంగా ఉంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన నియోజకవర్గంలో రెండు వేలు అంటే రెండు వేల సభ్యత్వాలు చేయించారు. అవి కూడా ఆయన చేయించలేదని.. కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు సొంతంగా తీసుకున్నారని అంటున్నారు. ఇలాంటి నియోజకవర్గాలు ఇంకా 30..40 వరకు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
వీరంతా తాము సభ్యత్వాలు చేయిస్తే రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతుందని అసలు పట్టించుకోవడం లేదన్న ్భిప్రాయంతో ఉన్నారు. ఎక్కువ సభ్యత్వాలు చేస్తే హైకమాండ్ రేవంత్‌నే అభినందిస్తుదని.. తమను పట్టించుకోదని అంటున్నారు. అయితే ఇలాంటి మైండ్ సెట్ వల్లనే కాంగ్రెస్ పార్టీ రానురాను కృశించి పోతోందని.. పార్టీ సభ్యత్వాలు చేయిస్తే పార్టీకే లాభం కానీ.. రేవంత్ రెడ్డికి లాభం అని అనుకోవడం ఏమిటని ఇతర నేతలు ప్రశ్నిస్తున్నారు.