టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల కొరత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. మన హీరోలకు తగిన సంఖ్యలో హీరోయిన్లు లేరన్నది వాస్తవం. అందుకే ఉన్నవాళ్లతోనే సర్దుకుపోవాల్సివస్తోంది. వాళ్ల డిమాండ్లకు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సినిమాకి స్టార్ హీరోయిన్ ఉండడం బలమే. కాకపోతే… వాళ్లని భరించడం మాత్రం చాలా కష్టంగా మారుతోంది.
అనుష్క, తమన్నా, సమంత, రష్మిక, పూజా హెగ్డే, కాజల్, సాయి పల్లవి… వీళ్లంతా మన స్టార్ హీరోయిన్లే. ఒకొక్కరి పారితోషికం రెండు కోట్ల నుంచి… 4 కోట్ల వరకూ ఉంది. సినిమాని బట్టి పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అడిగిందంతా ఇవ్వడానికి నిర్మాతలూ రెడీనే. కాకపోతే.. ఈ హీరోయిన్ల ఎగస్ట్రా వ్యవహారాలే తడిసి మోపెడు అవుతున్నాయి.
హీరోయిన్లకు పారితోషికం ఇవ్వడమే కాకుండా, వాళ్ల స్టాప్‌ని కూడా భరించాల్సివస్తోంది. ఒక్కో హీరోయిన్ కోసం కనీసం 10 నుంచి 12 మంది వరకూ వ్యక్తిగత సిబ్బంది పనిచేయాల్సివస్తోంది. మేకప్‌కి ఇద్దరు, హెయిన్ స్టైలింగ్ కి ఇద్దరు, కాస్ట్యూమ్స్‌కి ఇద్దరు, వ్యక్తిగత వ్యవహారాలు చూసుకోవడానికి ఇద్దరు.. దీనికి తోడు బౌన్సర్లు. ఇలా హీరోయిన్ చుట్టూ పది, పదిహేనుమంది ఉండాల్సిందే. వీళ్ల బత్తాలు, భోజనాలు, హోటెల్ రూములు ఇవన్నీ నిర్మాతలే భరించాల్సివస్తోంది. ఓ స్టార్ హీరోయిన్ కి రోజువారీ ఖర్చు రూ.లక్ష అంటే నమ్మగలరా? కానీ ఇది అక్షరాలా నిజం. ఇది వరకు హీరోయిన్‌కి క్యార్ వేన్ ఉంటే సరిపోయేది. ఇప్పుడు వ్యక్తిగత సిబ్బంది కూడా క్యార్ వాన్ అడగడం, దానికి నిర్మాతలు కూడా రెడీ అయిపోవడం.. చూస్తుంటే విడ్డూరంగా మారుతోంది.
ఓ స్టార్ హీరోయిన్‌కి రోజువారీ భోజనం నిమిత్తం.. నిర్మాత రూ.15 వేలు చెల్లించాలట. సదరు హీరోయిన్ తిన్నా, తినకపోయినా.. రోజుకి రూ.15 వేలు ఇవ్వాల్సిందే. అది రూలు. ఓ హీరోయిన్ కనీసం ఐదుగురు బౌన్సర్లతో సెట్ కి వస్తోందట. అసలు సెట్ కి బౌన్సర్ల అవసరం ఏమిటి? అనేది పెద్ద ప్రశ్న. ఆ బౌన్సర్లకు.. జీతాలు నిర్మాతల ఖాతాల్లోంచే వెళ్లాలట. ఇలా.. స్టార్ హీరోయిన్‌ని పెట్టుకుంటే వాళ్ల అదనపు ఖర్చు సినిమా పూర్తయ్యేసరికి తడిసి మోపెడు అవుతోంది. అయితే దీనికి బాధ్యత కచ్చితంగా నిర్మాతదే.
నాకు ఫలానా హీరోయినే కావాలి… అనుకున్నప్పుడు, వాళ్లకు డిమాండ్ ఉన్నప్పుడు ఇలాంటి షరతులే విధిస్తారు. `నేను నీకు పారితోషికం మాత్రమే ఇస్తా.. అదనపు ఖర్చులకు నాతో సంబంధం లేదు` అని నిర్మాత తెగేసి చెప్పేస్తే హీరోయిన్లు ఇంతింత ఖర్చులు ఎందుకు చేస్తారు?