2022 జనవరిలో గంపగుత్తగా సినిమాలొచ్చాయి. తొలి నెలలో దాదాపు డజను చిత్రాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరిలో ఆ హోరు, జోరు ఇంకాస్త ఎక్కువగానే ఉండబోతోంది. ఫిబ్రవరిలో దాదాపు 20 సినిమాలైనా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ వుంది. తొలి వారంలోనే ఏకంగా 5 సినిమాలొస్తున్నాయి. ఫిబ్రవరి 4న విశాల్ `సామాన్యుడు` విడుదల అవుతోంది. యాక్షన్ నేపథ్యంలో సాగే కథ ఇది. టీజర్,ట్రైలర్.. ఓకే అనిపించి, ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. ఎప్పుడో పూర్తయిపోయిన శ్రీకాంత్ – కోతలరాయుడుకి ఇప్పుడు మోక్షం దక్కింది. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన అతడు ఆమె ప్రియుడు ఈవారం విడుదలకు సిద్ధమైంది. సునీల్ కథానాయకుడిగా నటించాడు. పాటు పటారు పాళెం అనే ఓ చిన్న సినిమా కూడా ఈ వారమే ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాయి.
సుదీప్ `కిచ్చ 3` కూడా ఫిబ్రవరి 4నే విడుదల అవుతోంది. శివ కార్తిక్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇది వరకు `కోటికొక్కడు` తెలుగులో మంచి వసూళ్లనే అందుకుంది. దాంతో సీక్వెల్స్ రెడీ అయిపోయాయి. తెలుగులో ఏ డబ్బింగ్ సినిమా ఎప్పుడు కాసులు కురిపించుకుంటుందో చెప్పలేం. అందుకే సుదీప్ సినిమాపైనా గురి పెట్టారు.