“ఇవి ఇండ్లా. వీటిలో మనుషులు ఉంటారా? మీకు వెంటనే డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తాం. రేపు మీరెవరూ పనికి పోవద్దు. ఇంట్లోనే ఉండండి. అధికారులు మీ దగ్గరికి వచ్చి వివరాలు తీసుకుంటారు. ఈ ఇండ్ల యజమానులకు, కిరాయిదారులకు ఐదు నెలల్లో సొంత ఇండ్లు కట్టిస్తారు”, ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 13 నెలల క్రితం వరంగల్ నగరంలో ఇచ్చిన హామీ. ఇంత వరకూ అతీ గతీ లేదు. అయినా వరంగల్ లో కారు దూసుకుపోతుందని, ఆనాటి హామీనెరవేరలేదనే విషయాన్ని జనం మర్చిపోతారని తెరాస శ్రేణులు ధీమాగా ఉన్నాయి.
కేసీఆర్ 2015 జనవరి 10వ తారీఖున వరంగల్ నగరంలో పర్యటించారు. భగత్ సింగ్ నగర్, దీన్ దయాళ్ నగర్, జితేందర్ నగర్ లలోని మురికి వాడల్లో ప్రజలకు హామీ ఇచ్చారు. ఐదునెలల్లో మళ్లీ వస్తా. మీ కొత్త ఇంట్లో దావత్ చేసుకుందాం అని ఆశలు కల్పించారు. మర్నాడే వస్తారన్న అధికారులు అడ్రస్ లేరు. పేద ప్రజలు 13 నెలలుగా ఆశతో ఎదురు చూస్తున్నా ఇళ్ల నిర్మాణం జరగనే లేదు.
వరంగల్ ను గ్రేటర్ గా ప్రకటించారు. కానీ ఈ నగరానికి ఇచ్చిన హామీలు మాత్రం చాలా వరకు నెరవేరలేదు. అయినా, వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో మెజారిటీ రికార్డు మోత మోగింది. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని తెరాస నాయకులు బల్లగుద్ది చెప్తున్నారు. కేసీఆర్ హామీ ఈరోజు కాకపోతే రేపైనా నెరవేరుతుందని ప్రజలకు తెలుసని వారు అంటున్నారు. కరీంనగర్ జిల్లాలో పక్కా ఇళ్లు కట్టిస్తామని ఉన్న ఇళ్లు కూల్చిన తర్వాత పాపం ఆ కుటుంబాల వారు డేరాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఆ ఊరి ప్రజలు వణికించే చలిలోనూ గుండె రాయి చేసుకుని బతకడానికి అలవాటు పడ్డారు. అలా చలికాలం కూడా గడిచిపోయిందిగానీ పక్కా ఇంటి జాడలేదు. డబుల్ బెడ్ రూమో సింగిల్ బెడ్ రూమో ఏదో ఒక ఇల్లు కట్టిస్తే చాలు మహా ప్రభో అని వేడుకుంటున్నారు.
వరంగల్ లోని మురికి వాడల ప్రజలకు మంచి సొంత ఇంటి కల నెరవేరే రోజు దగ్గర్లోనే ఉందని ఇప్పుడు గులాబీ శ్రేణులు భరోసా ఇస్తున్నాయి. కార్పొరేషన్లో కారు దూసుకుపోతే, ఓరుగల్లుపై గులాబీ జెండా ఎగిరితే ఇక మీకు అన్నీ మంచి రోజులే అని వాగ్దానాలు చేసేస్తున్నారు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో వరస విజయాలను సాధిస్తున్న తెరాస, వరంగల్ లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమాగా ఉంది. కొన్ని హామీలు అమలు కాకపోయినా వచ్చే నష్టం లేదనేది కేసీఆర్ అనుచరుల సూత్రీకరణ. జనం కూడా ఇదే ఫాలో అవుతారేమో చూద్దాం.