డిల్లీ జె.ఎన్.యు. విద్యార్ధి కన్నయ్య కుమార్ బెయిల్ పిటిషన్ పై నిన్న విచారణ చేపట్టిన డిల్లీ హైకోర్టు, ఈ వ్యవహారంపై యూనివర్సిటీ కమిటీ దర్యాప్తు చేసిన ఇచ్చిన నివేదికను కూడా కోర్టుకు సమర్పించాలని డిల్లీ పోలీసులను ఆదేశిస్తూ, కేసును ఈరోజుకి వాయిదా వేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ఉమర్ ఖాలిద్, అనిర్భాన్ భట్టాచార్యలు ఇద్దరూ పోలీసులకు లొంగిపోయేందుకు సంసిద్దత వ్యక్తం చేసారు. వారు కూడా తమకు రక్షణ కల్పించాలని కోర్టుకి విజ్ఞప్తి చేసారు.
ఈ కేసులో డిల్లీ పోలీసుల చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు కనబడుతోంది. మొదట వారి అతనిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలనుకొన్నారు. కానీ సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయడంతో వెనక్కి తగ్గవలసి వచ్చింది. కొన్ని రోజుల క్రితం, వారి తరపున వాదించిన న్యాయవాది ‘తాము కన్నయ్య కుమార్, అతని సహచర విద్యార్ధులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకొంటే వ్యతిరేకించబోమని’ హైకోర్టుకి తెలిపారు. కానీ మళ్ళీ నిన్న ‘మారిన పరిస్థితుల దృష్ట్యా’ వారి బెయిల్ ని వ్యతిరేకించాలనుకొంటున్నట్లు కోర్టుకి తెలియజేసారు. ఈ కేసుపై డిల్లీ పోలీస్ కమీషనర్ బస్సికి పోలీసులు నిన్న ఒక ప్రాధమిక నివేదికను అందజేశారు. దానిలో ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న కన్నయ్య కుమార్, తదితరులను దోషులుగా నిరూపించే ఎటువంటి ఆధారాలు చూపలేదు. కేవలం ఒక టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగ్ ఆధారంగానే ఈ కేసు నమోదు చేసినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.
యూనివర్సిటీ ప్రాంగణంలో అఫ్జల్ గురు సంస్మరణ సభను నిర్వహించినట్లు చెప్పబడుతున్న ఉమర్ ఖాలిద్, అనిర్భాన్ భట్టాచార్య, మరో ముగ్గురు విద్యార్ధులు గత వారం రోజులుగా పరారీలో ఉన్నారు. వారు మొన్న ఆదివారం రాత్రి మళ్ళీ యూనివర్సిటీకి తిరిగివచ్చేరు. వారిలో ఉమర్ ఖాలిద్, అనిర్భాన్ భట్టాచార్య పోలీసులకు లొంగిపోవడానికి సంసిద్దత వ్యక్తం చేస్తున్నారు. కనుక వారి ద్వారా కన్నయ్య కుమార్ ని దోషిగా నిరూపించేందుకు ఆధారాలు రాబట్టవచ్చని డిల్లీ పోలీసులు భావిస్తున్నందునే కన్నయ్య కుమార్ బెయిల్ ని వ్యతిరేకిస్తామని కోర్టుకి తెలియజేసి ఉండవచ్చును. ఈరోజు డిల్లీ హైకోర్టు మళ్ళీ అతని బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టి తీర్పు చెప్పే అవకాశం ఉంది.